అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dhanurmasam | ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఆలయాలు, ఇళ్లు పండుగ వాతావరణంతో నిండిపోతాయి. దీనిని దివ్య ప్రార్థనకు అనువైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో వైష్ణవ ఆలయాలు, సూర్యాలయాలను సందర్శించడం అత్యంత పుణ్యప్రదం.
మార్గశీర్ష మాసం: Dhanurmasam | శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘మాసాల్లో మార్గశిరం నేనే’ అని చెప్పాడు. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న ఈ మాసాన్ని ‘మార్గశీర్షం’ అని పిలుస్తారు. మార్గం అంటే దారి లేదా ఉపాయం, శీర్షం అంటే ప్రధానమైనది. అంటే, మార్గశీర్షం అంటే భగవంతుడిని చేరే శ్రేష్ఠమైన మార్గాన్ని సూచించేది. .
శ్రీవ్రతం (సిరినోము): Dhanurmasam | ఈ పవిత్ర మాసంలో ఆచరించే వ్రతమే ధనుర్మాస వ్రతం. ఉపనిషత్తుల ప్రకారం, ధనస్సు అంటే పరమాత్ముని ఉనికిని తెలియజేసే ప్రణవం (ఓంకారం). ఆ నాదంతోనే (సంగీతం) గోదాదేవి వ్రతం చేసి దైవాన్ని చేరింది. అనగా గోదాదేవి నెల రోజుల పాటు అత్యంత నిష్ఠతో వ్రతం ఆచరించి, రంగనాథుడి చెంతకు చేరింది.
గోదాదేవి తిరుప్పావై వ్రతం: Dhanurmasam | ధనుర్మాసం అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది రంగనాథ స్వామి (శ్రీ మహావిష్ణువు) భక్తురాలు, భూదేవి అవతారమైన గోదాదేవి (ఆండాళ్). గోదాదేవి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై (తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం). వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని 30 పాశురాల్లో అందించిన ఈ కావ్యం అత్యంత శక్తివంతమైనది. నెల రోజులు రోజుకొక పాశురం గానం చేసి, గోదాదేవి రంగనాథ స్వామిని పొందినట్లుగా, మనం కూడా దైవానుగ్రహాన్ని పొందవచ్చు.
తిరుమలలో ప్రత్యేకత: తిరుమల వంటి ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. ఈ మాసంలో సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలు వినియోగించడం కూడా ఒక ప్రత్యేక ఆచారం.
వ్రత నియమాలు: ఈ మాసంలో భగవంతుడిని ఆరాధించడం వలన లక్ష్మీదేవి,రంగనాథ స్వామి (శ్రీమహావిష్ణువు) అనుగ్రహం లభించి సకల దరిద్రాలు తొలగిపోతాయని నమ్మకం.
బ్రహ్మ ముహూర్తం: ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలోనే (సూర్యోదయానికి ముందే) స్నానాదికాలు పూర్తిచేసి, తిరుప్పావై పారాయణం చేయడం అత్యంత శుభకరం. ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం తప్పనిసరి.
నైవేద్యం: ఈ మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూధనుడుగా పూజిస్తారు. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాతి 15 రోజులు దధ్యోజనం (పెరుగు అన్నం) నివేదించాలి.
కన్యా వ్రతం: వివాహం కాని అమ్మాయిలు గోదాదేవి మార్గళి వ్రతం ఆచరిస్తూ, ఇంటి ముంగిట ముగ్గులు వేసి, లక్ష్మీ రూపమైన గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల ఉత్తమ వరుడు లభిస్తాడని విశ్వసిస్తారు.