అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | వర్షాలు తగ్గడంతో నాలాల్లో వరద తగ్గుముఖం పట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ పరిస్థితులను వినియోగించుకుని నాలాల్లో పూడికను పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. నగరవ్యాప్తంగా నాలాల్లో పూడిక తీసే పనులను ముమ్మరం చేయాలని సూచించారు.
జూబ్లీహిల్స్ (jubilee hills) నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాలలో నాలాల్లో పూడిక తీత పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. నాలాల్లో పూడిక తీత పనులకు, వరద ప్రవాహానికి ఆటంకాలను తొలగించేందుకు ఇదే సరైన సమయమన్నారు. హరిహరపురంలోని కాప్రాయి చెరువుతో పాటు.. శంషాబాద్, పెద్దగోల్కొడలోని నరసింహ చెరువు, బాలాపూర్ మండలంలోని కోమటి కుంటను హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) పరిశీలించారు. వర్షాకాలం ఏ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిందనేది ఇప్పటికే తెలిసింది కనుక.. వచ్చే ఏడాది అలాంటి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలన్నారు.
Hydraa | చెరువులతో వరదలకు అడ్డుకట్ట..
నగరంలో చెరువులను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువులను తగిన మొత్తంలో ఖాళీ చేయించి.. వరద నీరు నిలిచేలా చూడాలన్నారు. ఎల్‌బీనగర్ (LB Nagar) నియోజకవర్గం పరిధిలోని హరిహరపురం కాలనీలో ఉన్న కాప్రాయి చెరువుకు ఔట్‌లెట్‌లు లేక ఎగువున ఉన్న తమ కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇన్‌లెట్ ద్వారా ఎంత మొత్తంలో వరద వస్తుందో అంతే మొత్తం కిందకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Hydraa | పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం
శంషాబాద్ (Shamshabad) మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్‌లు వరద నీటిలో మునిగిపోతుండటంతో తాము పాఠశాలకు వర్షాకాలం వెళ్లలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వరద కాలువల్లో పూడికను తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందని కమిషనర్ అధికారులకు సూచించారు.

