HomeజాతీయంDelhi Blast Case | ఢిల్లీ పేలుడు ఘటన.. మౌల్వీ ఇర్ఫాన్‌ అరెస్ట్

Delhi Blast Case | ఢిల్లీ పేలుడు ఘటన.. మౌల్వీ ఇర్ఫాన్‌ అరెస్ట్

వైద్యులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న జమ్మూకశ్మీర్​లోని షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు. వైట్​ కాలర్​ ఉగ్ర మాడ్యూల్​ వెనుక ఇతడు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Delhi Blast Case | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైద్యులను ఉగ్రవాదులుగా మారుస్తున్న మౌల్వీ ఇర్ఫాన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఢిల్లీ ఎర్రకోట (Red Fort) సమీపంలో సోమవారం సాయంత్రం కారులో పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు.

ఢిల్లీ ఘటన వెనుక డాక్టర్​ ఉమర్​ కీలక సూత్రధారి అని పోలీసులు ఇదివరకే గుర్తించారు. అయితే దేశవ్యాప్తంగా పలువురు వైద్యులు భారీ ఉగ్రకుట్రకు యత్నించిన విషయం తెలిసిందే. ఫరీదాబాద్‌ వైట్‌ కాలర్‌ ఉగ్ర మాడ్యూల్‌ గుట్టును భద్రతా బలగాలు రట్టు చేశాయి. జైషే మొహమ్మద్ (Jaish-e-Mohammed), అన్సార్‌ ఘజ్‌వాత్‌–ఉల్‌–హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులుసహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వైట్​ కాలర్​ ఉగ్రమాడ్యుల్​ వెనక కీలక పాత్రధారిగా జమ్మూకశ్మీర్-షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్‌ (Maulvi Irfan) ఉన్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తాజాగా అతడిని అరెస్ట్​ చేశారు.

Delhi Blast Case | యువతను ప్రభావితం చేసి..

దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అలియాస్​ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే విద్యావంతులైన యువతను ప్రభావితం చేసేవాడు. మత బోధకుడు, ఆరోగ్య కార్యకర్త అని చెప్పుకొని వారితో పరిచయం పెంచుకునే వాడు. అనంతరం పలువురిని ప్రభావితం చేసితీవ్రవాదం వైపు మళ్లించాడు. ఇర్ఫాన్ వైద్య నిపుణులను నియమించడం, నిధులు సేకరించడం, లాజిస్టిక్‌లను ఏర్పాటు చేయడం, అధునాతన పేలుడు పరికరాల (IED)లు కోసం పదార్థాలను సేకరించడంలో సహాయపడే వైట్-కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌ను నిర్మించి విస్తరించాడని అధికారులు తెలిపారు. అతని నివాసంలో జరిగిన దాడుల సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ (Electronic Gadgets)లను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Blast Case | పోస్టర్​లతో విచారణ

అక్టోబర్ 19న బన్‌పోరా నౌగామ్‌లో జైష్-ఎ-ముహమ్మద్ (జెఎం) పోస్టర్లు కనిపించాయి. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడంతో వైట్ కాలర్​ ఉగ్ర నెట్​వర్క్​ బయట పడింది. అనంతరం పోలీసులు ఇర్ఫాన్​ ముగ్గురు సహచరులను అరెస్టు చేశారు. తాజాగా అతడిని సైతం అదుపులోకి తీసుకున్నారు.

Must Read
Related News