అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Montha | మొంథా తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలను వణికించింది. పెద్దగా ప్రాణ నష్టం జరుగకపోయినప్పటికీ, ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరాన్ని దాటిన తర్వాత తుపాను బలహీనపడిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. “ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను మొంథా గంటకు 10 కి.మీ. వేగంతో వాయువ్య దిశగా కదిలి తుపానుగా బలహీనపడింది” అని ఐఎండీ తెలిపింది. తుపాను కేంద్రం నర్సాపూర్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 20 కి.మీ, మచిలీపట్నంకు ఈశాన్యంగా 50 కి.మీ మరియు కాకినాడకు పశ్చిమ-నైరుతి దిశలో 90 కి.మీ దూరంలో ఉంది. మచిలీపట్నం మరియు విశాఖపట్నం వద్ద డాప్లర్ రాడార్ల ద్వారా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Cyclone Montha | భారీగా ఆస్తి నష్టం
తీవ్ర తుపానుతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒడిశాలోని అనేక జిల్లాల్లో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ఆంధ్రలోని కోనసీమ జిల్లాలో పెనుగాలుల కారణంగా చెట్టు కూలి మీద పడడంతో ఒక మహిళ మరణించింది. తుపాను ప్రభావం కారణంగా, ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 38,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరదలు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాలు భారీ వర్షాలు, ఈదురుగాలుల్లో అతులాకుతలమయ్యాయి.
Cyclone Montha | ఏడు జిల్లాలపై ఎఫెక్ట్..
ఏపీలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుపాను (Cyclone Montha) తీవ్ర ప్రభావం చూపింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుంభవృష్టి కురవడంతో పాటు తర్వాత పెనుగాలులు విరుచుకుపడింది. గతంలో ఏ తుపాను సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయ తాండవం చేసింది. భారీ శబ్దాలతో 10 మీటర్లకు పైగా ఎత్తులో కెరటాలు ఎగసిపడడంతో కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో 10 కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది. కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి.
విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వేలాది చెట్లు నేలకొరిగాయి. మొంథా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎక్కడికక్కడ చెట్లు మొదళ్లతో సహా నేలకు ఒరిగాయి. కొన్నిచోట్ల చెట్లు పడి కార్లు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్డులో సీతకొండపైనుంచి బండరాళ్లు జారి పడ్డాయి. వర్షాలకు కొండలపై నుంచి నీటితోపాటు కొండచిలువ కూడా కొట్టుకురావడంతో ఆరిలోవలో కలకలం రేగింది. కృష్ణా జిల్లాలో (Krishna District) బలమైన గాలులధాటికి రహదారులపై వృక్షాలు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, కాళ్ల మండలాల్లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి.
Cyclone Montha | ఒడిశాలోనూ భారీ వర్షాలు..
ఒడిశాలో తీరప్రాంత, దక్షిణ జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీనివల్ల కొండచరియలు విరిగిపడడం, ఇళ్లు దెబ్బతినడంతో పాటు చెట్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. దక్షిణాదిలోని ఎనిమిది జిల్లాలు – మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం, కంధమాల్, కలహండి, నబరంగ్‌పూర్ నుంచి భారీగానే నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద, ఈ ప్రాంతంలోని 15 జిల్లాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

