అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Crude Oil Price Surge | అంతర్జాతీయ మార్కెట్ (International Market)లో క్రూడ్ ఆయిల్ ధరలు సెగలు రేపుతున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్‌తో ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా (West Asia)లో నెలకొన్న ఉద్రిక్తతలు కలవరపెడుతున్నాయి. గురువారం బ్యారెల్ ధర 70.53 డాలర్లు దాటింది. గతేడాది సెప్టెంబర్ 26 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
Crude Oil Price Surge | ధర ఎందుకు పెరుగుతోందంటే..
చమురు ధరల పెరుగుదలకు భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాలను కారణంగా భావిస్తున్నారు. ఇరాన్ అణుకార్యక్రమం (Iran Nuclear Program) విషయంలో అగ్రరాజ్యం యూఎస్ ఆగ్రహంతో ఉంది. ఇరు దేశాల మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. చర్చలు విఫలమైతే ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 30 శాతం వరకు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతుంది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో యుద్ధం జరిగితే ఇరాన్ ఈ జలసంధిని మూసివేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
భారతదేశం (India) ప్రధానంగా చమురు దిగుమతులపై ఆధారపడి ఉంది. మన చమురు అవసరాలను 85 శాతానికిపైగా దిగుమతులే తీరుస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు పెరుగుతుండడంతో దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ప్రస్తుతం చమురు దిగుమతులకోసం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రూపాయి ఒత్తిడికి గురవుతోంది.