అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR on Speaker | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ (Speaker Gaddam Prasad Kumar) నిర్ణయం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్పీకర్ తీరు రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు వేయగా స్పీకర్ 8 పిటిషన్లు కొట్టివేసిన విషయం తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Jagtial MLA Sanjay)కు బుధవారం ఫిరాయింపు కేసులో ఊరట ఇచ్చారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సంజయ్‌కు సీఎం కండువా కప్పిన ఫొటోలు కనిపిస్తున్నా.. ఆధారాలు లేవనడం అర్థరహిమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ (Congress) ఉప ఎన్నికలకు భయపడుతోందన్నారు.
KTR on Speaker | ప్రజాస్వామ్యం ఖూనీ
ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫొటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును, ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వేళ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బ తీసినట్లు అవుతుందన్నారు.
KTR on Speaker | రాహుల్‌గాంధీకి ఆ అర్హత లేదు
మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు (Revanth Government) వణికిపోతోందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదన్నారు.