అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Constable Soumya | నిజామాబాద్ (Nizamabad) ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
సౌమ్య స్వగ్రామం మోస్రా (Mosra). ఆమె తల్లిదండ్రులు పప్పులు, మసాలాలు అమ్ముతూ జీవించేవారు. పేదరికంలో ఉన్నా.. కూతురుని బాగా చదివించారు. తల్లిదండ్రుల తన మీద పెట్టుకున్న ఆశలను సౌమ్య నెరవేర్చింది. కష్టపడి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. 2024 బ్యాచ్‌కు చెందిన ఆమె నగరంలో గంజాయి ముఠాను పట్టుకునేందుకు యత్నించగా.. నిందితులు కారుతో ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను మొదట నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS)కు తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ సౌమ్య శనివారం రాత్రి 9:41 గంటలకు మృతి చెందింది.
సౌమ్య మృతితో ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆమె విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు సౌమ్య మృతికి సంతాపం తెలిపారు.
Constable Soumya | సీఎం సంతాపం
సౌమ్య మృతదేహాన్ని ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పిస్తారు. అనంతర ఆమె మృతదేహాన్ని స్వగ్రామం మోస్రా తరలించనున్నారు. సౌమ్య మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సౌమ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.