అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Clean Max Enviro IPO | పునరుత్పాదక ఇంధన సరఫరాదారుల పరంగా క్లీన్ మాక్స్ ఎన్విరో ప్రముఖ కంపెనీలలో ఒకటి. క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ మొదట మహారాష్ట్రలోని ముంబయిలో 2010లో ప్రారంభమైంది. వాణిజ్య, పారిశ్రామిక పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, విద్యుత్ ఉత్పత్తి, అమ్మకాలలో ఈ కంపెనీ నిమగ్నమై ఉంది.
దేశీయంగానే కాకుండా దుబాయి, థాయిలాండ్, బ్యాంకాక్, బహ్రెయిన్‌లలోనూ సేవలందిస్తోంది. సమర్థవంతమైన మరియు సరసమైన ప్రాజెక్ట్ అభివృద్ధి, అమలు మరియు నిర్వహణ కంపెనీ బలం. ఈ కంపెనీ రూ.3,100 కోట్లు సేకరించడానికి ఐపీవో (IPO)కు వస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ. 1,200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 1,900 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను అప్పుల చెల్లింపు, కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.
కంపెనీ ఆర్థిక పరిస్థితి..
క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (Clean Max Enviro Energy Solutions Ltd)గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,610.34 కోట్ల ఆదాయం ద్వారా రూ. 19.43 కోట్ల ప్యాట్ జనరేట్ చేసింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,425.31 కోట్ల ఆదాయంతో రూ. 37.64 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం చివరి నాటికి రూ. 969.35 కోట్ల ఆదాయం ద్వారా రూ. 19 కోట్ల ప్యాట్ జనరేట్ అయ్యింది.
ప్రైస్‌బ్యాండ్..
ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 1,000 నుంచి రూ. 1,053 మధ్య నిర్ణయించింది. ఒక లాట్లో 14 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 14,742 తో బిడ్ వేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా : క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 50 శాతం, ఎనఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులతో ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో డిమాండ్ లేదు.
ముఖ్యమైన తేదీలు..
ఈనెల 23న ఐపీవో సబ్స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 26న అలాట్మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు వచ్చే నెల రెండో తేదీన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి.