అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్‌లోని ఆలూర్‌లో చిన్నారుల కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ (Armoor Police station) పరిధిలోని ఆలూరు మండల కేంద్రంలో శనివారం మల్లన్న జాతర జరిగింది. అయితే జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు వచ్చిన పదేళ్ల వయస్సు ఉన్న నలుగురు చిన్నారులకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి వారిని ఓ డ్రైవర్ ఆటోలో ఎక్కించుకున్నాడు.
అక్కడి నుంచి వారిని ఆటోలో కల్లెడ వైపు తీసుకువెళ్తుండగా.. గ్రామంలోని సుభాష్‌చంద్రబోస్ విగ్రహం వద్ద స్పీడ్‌బ్రేకర్ వద్ద ఆటోను స్లో చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు ఆటోలో నుంచి కిందికి దూకారు. దీంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆటోను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి ఆర్మూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. కాగా.. నిందితుడు, ఆటోను ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.