అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chat GPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పలు రంగాల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్‌ఫామ్‌లు ఏఐ సేవలు అందిస్తున్నాయి.
అందులో చాట్ జీపీటీ ఒకటి. చాట్ జీపీటీ (Chat GPT) భారత్‌లో తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదు లక్షల మందికి చాట్ జీపీటీ ప్లస్ యాక్సెస్ ఉచితంగా ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఐదు లక్షల ఉచిత చాట్ జీపీటీ ప్లస్ ఖాతాలను పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రాబోయే ఆరు నెలల్లో తమ ఏఐ ప్లాట్‌ఫారమ్ (AI Platform) విద్యార్థులకు చేరువ అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు పలు ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. భారత మార్కెట్లో త్వరగా విస్తరించేందుకు ఓపెన్ ఏఐ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరిత సమాధానాలు, అసైన్‌మెంట్‌ల కోసమే కాకుండా.. విషయాల యొక్క లోతైన అవగాహనకు మద్దతు ఇచ్చే సాధనంగా AIని మార్చడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది.
Chat GPT | రాఘవ్గుప్తా నియామకం
ఆసియా పసిఫిక్‌లో కోర్సెరా కార్యకలాపాలకు గతంలో నాయకత్వం వహించిన రాఘవ్ గుప్తా (Raghav Gupta)ను చాట్‌జీపీటీ భారత్‌లో విద్యా విభాగాధిపదిగా నియమించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలను చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యా విధానంలో ఏఐ మార్పును తీసుకురాగల దశలో ఉందన్నారు.
Chat GPT | పరిశోధనలకు మద్దతు
ఓపెన్ ఏఐ దేశంలో పరిశోధనలకు కూడా మద్దతు ఇస్తోంది. విద్యలో AI పాత్రపై దీర్ఘకాలిక అధ్యయనం కోసం ఐఐటీ మద్రాస్‌తో (IIT Madras) కీలక ఒప్పందం చేసుకుంది. ఇందు కోసం ఐదు లక్షల డాలర్ల నిధులను కూడా కేటాయించింది. చాట్ జీపీటీ వంటి సాధనాలు బోధనా పద్ధతులను ఎలా మార్చగలవు, విద్యార్థులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో పరిశోధనలో తేల్చనున్నారు. చాట్ జీపీటీ భారత్‌లో తన మొదటి కార్యాలయాన్ని ఢిల్లీలో ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తామని తెలిపింది.
Chat GPT | రెండో అతిపెద్ద మార్కెట్
చాట్ జీపీటీకి అమెరికా (America) తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్. దీంతో ఇక్కడ మరింత విస్తరించాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వినియోగదారుల కోసం నెలకు రూ. 399 ధరతో ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. తాజాగా OpenAI లెర్నింగ్ యాక్సిలరేటర్ పేరిట ఐదు లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉచిత యాక్సెస్ అందించనుంది.
