అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandra babu naidu | వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామనుకునే ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు (Chandra babu Naidu) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధాంతాలకంటే స్వీయ ప్రచారం, వ్యక్తిగత బలం మీద ఆధారపడుతున్న నాయకులను తప్పుబట్టారు. అలాంటి వారు పార్టీ అండ లేకుండా బయటకు వెళ్లి పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. “పార్టీ లేకుండా మీ స్థితి ఏంటో అప్పుడు తెలుస్తుంది” అంటూ ఎమ్మెల్యేలపై సీఎం ఫైర్ అయ్యారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుమారు నాలుగు గంటలు పార్టీ నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వివాదంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Chandra babu naidu | సీరియస్ కామెంట్స్..
ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీధర్, విజయవాడ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) లను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీకి పిలిపించి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఇద్దరితో స్వయంగా మాట్లాడతానని, విభేదాలు సర్దుబాటు కాకపోతే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. “పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిందే” అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు (MS Raju) భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం స్పందించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుందని గుర్తుచేశారు. “ఎవరు మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. బాధ్యతతో ప్రవర్తించాలి” అని సూచించారు.
పార్టీ కార్యకర్తలను సుశిక్షితులుగా తీర్చిదిద్దడంపై సీఎం దృష్టి సారించారు. “రాజకీయాలు డబ్బు సంపాదన కోసం కాదు, ప్రజాసేవ కోసం” అని స్పష్టం చేశారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాలనుకునే వారు వేరే మార్గం చూసుకోవాలని సూచించారు. లిక్కర్ వ్యాపారాల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “అలా సంపాదించిన డబ్బు నిలవదు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం అందుకు ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతి వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తానని, ప్రభుత్వపరంగా మరియు పార్టీ పరంగా సమన్వయం కొనసాగిస్తానని తెలిపారు.
