అక్షరటుడే, వెబ్డెస్క్ : S-400 | దేశ రక్షణను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శత్రు దేశాల నుంచి తలెత్తే ముప్పును తప్పించుకునేందుకు రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేసింది.
ఈ క్రమంలో మరిన్ని ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతమైన ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా పని చేశాయి. పాకిస్తాన్ వైమానిక దాడులను పూర్తి స్థాయిలో అడ్డుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు ప్రారంభించింది. భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంచడానికి ఐదు S-400 క్షిపణుల ఒప్పందాన్ని ఖరారు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని అగ్ర ప్రతినిధులు రష్యా అధికారులతో సమావేశం కానున్నారు.
S-400 | పుతిన్ పర్యటనకు ముందే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Putin) డిసెంబర్లో భారత పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనకు రాకముందే ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. రష్యాతో ఇండియాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ 5.43 బిలియన్ డాలర్లతో రష్యా నుంచి ఐదు S-400 యూనిట్లు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 5, 2018న ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే మూడు రక్షణ వ్యవస్థలు ఇండియాకు (India) అందజేయగా, మరో రెండింటిని 2026 చివరి నాటికి అందించే అవకాశముంది. ఇండియాకు ఉన్న 7,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి. ఉత్తర కమాండ్ ప్రాంతంలో అంతరాలను పరిష్కరించడానికి మరిన్ని ఎస్-400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యాతో సంప్రదింపులు జరుపుతోంది.
S-400 Missiles | రెండు స్థానికంగానే తయారీ..
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశముంది. ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలలో మూడు రష్యా నుంచి నేరుగా కొనుగోలు చేయనున్నారు. మరో రెండింటిని స్థానికంగానే తయారు చేయనున్నారు. వీటి తయారీలో కీలకమైన సాంకేతికతను బదిలీ చేసేందుకు రష్యా అంగీకరించే అవకాశముంది. 2018లో చేసుకున్న ఒప్పందం నాటి ధర ప్రకారమే వీటిని అందించేందుకు సుముఖత తెలుపనుంది.