HomeతెలంగాణRSS | శత వసంతాల ‘సంఘ్​’టనం..

RSS | శత వసంతాల ‘సంఘ్​’టనం..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RSS | కులాలవారీగా, వర్గాల వారీగా చీలిపోయి, ఆత్మన్యూనత భావనలో కూరుకుపోయిన హిందూ సమాజంలో ఐక్యతతోపాటు చైతన్యం తీసుకురావడం కోసం 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్​ (Rashtriya Swayamsevak Sangh) ఏర్పాటయ్యింది. ఈ దసరా నాటికి సంఘను స్థాపించి వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌(RSS) స్థాపన, ప్రస్థానం తెలుసుకుందామా..

RSS | ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన.. ఆవశ్యకత

మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. ఆయన దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(Congress)లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ఆ పార్టీ అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టీకరణ విధానాలపై ఆయన విభేదించారు. ప్రధానంగా ముస్లింలను బుజ్జగించేందుకోసం 1919-24 మధ్య కాలంలో జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమానికి (Khilafat Movement) కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇది దేశానికి మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో హిందువులపై జరిగిన దాడులతో ఆయన మరింత ఆందోళన చెందారు. 1920లలో జరిగిన అల్లర్లు భయాన్ని రేకెత్తించాయి. తమపై దాడులు జరుగుతున్నా హిందువులు ప్రతిఘటించకపోవడం ఆయనను నిర్ఘాంతపరిచింది. ఆయన దీనికి కారణాలను అన్వేషించారు. హిందూ దేశం వెయ్యేళ్లపాటు బానిసత్వంలో మగ్గిపోవడానికి గల కారణాలను తెలుసుకుని ఆశ్చర్యపోయారు. హిందువులు మెజారిటీగా ఉన్నా గుప్పెడు మంది చేతిలో ఎందుకు ఓడిపోయి బానిసలుగా మారడంపై విస్మయానికి గురయ్యారు.

ముస్లింల దండయాత్రలు, దేవాలయాల విధ్వంసం, బ్రిటిష్‌ (British) వారు అనుసరించిన విభజించి పాలించు (Divide and rule) వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. కులాలవారీగా, వర్గాలవారీగా విడిపోయిన హిందువులు పోరాడే శక్తిని కోల్పోయినట్లుగా ఆయన గుర్తించారు. వారిలో ఐక్యత కోసం ఏం చేయాలన్న విషయమై ఆలోచించారు. హిందూ సమాజం పరిస్థితిపై సన్నిహితులతో చర్చించారు. చివరికి జాతిని ఏకం చేసేందుకోసం హిందూ రాష్ట్ర (Hindu rashtra) భావనను రేకెత్తించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. భారత దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకు రావడమే లక్ష్యంగా నాగ్‌పూర్‌(Nagpur)లోని విజయనగర్‌ మైదానంలో మొదటి శాఖ ప్రారంభమైంది. కొంతమంది ఇక్కడ చేరి రోజూ గంటపాటు వ్యాయామాలు, ధ్యానం చేస్తారు. ఆటలు ఆడతారు. చివరికి ప్రార్థన చేస్తారు. ఇది శాఖలో నిత్యకృత్యం. గుప్పెడు మందితో నాగ్‌పూర్‌లో ప్రారంభమైన శాఖ (Shakha).. తర్వాత క్రమంగా విస్తరించి, విశ్వవ్యాప్తమైంది. ఎందరో స్వయం సేవకులు తమ జీవితాలను త్యాగం చేసి సంఘాన్ని వట వృక్షంగా మార్చారు. వారి కృషి వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద వలంటరీ సంస్థగా నిలిచింది.

RSS | అణచాలని చూస్తే..

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హిందూ సంఘటనలో ఎదుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేసేందుకు చాలా కుట్రలు జరిగాయి. స్వాతంత్య్రానంతరం 1948లో గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ముడిపెట్టి అప్పటి ప్రభుత్వం నిషేధించింది. ఎన్నో రకాలుగా స్వయం సేవకులు ఇబ్బందులు పడ్డారు. చివరికి గాంధీ హత్య(Gandhi Assassination)తో సంఘ్​కు​ ఎలాంటి సంబంధంలేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఎమర్జెన్సీ సమయంలో (1975-1977), 1992లో రామజన్మ భూమి విముక్తి సమయంలో నిషేధాలను ఎదుర్కొంది. ఎన్నిసార్లు నిషేధాలు విధించినా.. సంఘ్​ శక్తి తగ్గకపోగా మరింత వేగంగా విస్తరించింది.

RSS | హిందుత్వం.. జీవన విధానం

ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వాన్ని మతంగా చూడదు. ఇది ఒక జీవన విధానమని పేర్కొంటుంది. హిందూ భూమిలో జన్మించినవారంతా హిందూ జాతీయులేనని నమ్ముతుంది. ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానభిక్షను పెట్టిన భారత్‌(Bharath) దేశాన్ని మరోసారి పరమవైభవ స్థితికి చేర్చాలన్న లక్ష్యంతో సాగుతోంది. భూమిని మట్టిగా కాకుండా భరతమాతగా ఆరాధిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌లో వ్యక్తి పూజకు స్థానం లేదు. భగవాధ్వజం(కాషాయ ధ్వజం)ను గురువుగా స్వీకరించింది. హిందువుల సంఘటన కోసం ఏర్పాటైన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎక్కడ విపత్తు సంభవించినా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు సేవా కార్యక్రమాలలో ముందుంటారు.

RSS | సర్‌సంఘచాలక్‌ ఆధ్వర్యంలో..

ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడిని సర్‌సంఘచాలక్‌(Sarsanghchalak)గా వ్యవహరిస్తారు. సంస్థను స్థాపించిన 1925 నుంచి 1940 వరకు సర్‌సంఘ చాలక్‌గా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేబీ హెడ్గేవార్‌(K.B.Hedgewar) వ్యవహరించారు. ఆయన తర్వాత సంఘ్​ బాధ్యతలను గురూజీగా పిలవబడే మాధవ సదాశివ గోల్వల్కర్‌ స్వీకరించారు. ఈయన 1940 నుంచి 1973 వరకు ఈ బాధ్యతలలో ఉన్నారు. గురూజీ హయాంలోనే సంఘం వటవృక్షంగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఎన్నో సంస్థలను ఏర్పాటు చేశారు. ఆయన అనంతరం 1973 నుంచి 1994 వరకు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌ సర్‌సంఘ చాలక్‌గా ఉన్నారు. రాజేంద్ర సింగ్‌ 1994 నుంచి 2000 వరకు, కేఎస్‌ సుదర్శన్‌ 2000 నుంచి 2009 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి మోహన్‌ భాగవత్‌(Mohan Bhagwat) సర్‌సంఘచాలక్‌గా కొనసాగుతున్నారు.