అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు తీవ్ర నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నక్సల్స్‌కు కంచుకోటలుగా ఉన్న అడవులను సైతం బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. కీలక నేతలు సైతం హతం అవుతున్నారు. దీంతో ఆపరేషన్ కగార్ (Operation Kagar) ఆపాలని కొంతకాలంగా మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. తాము చర్చలకు సిద్ధమని గతంలో ప్రకటించారు. అయితే కేంద్రం మాత్రం చర్చల ప్రసక్తే లేదని చెప్పింది.
Maoists | శాంతియుత వాతావరణం కోసం..
తెలంగాణ (Telangana) లోని పలు పార్టీలు, ప్రజా సంఘాలు శాంతియుత వాతావరణం కోసం పోరాటం చేశాయని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. దీంతో మే నెలలో కాల్పుల విరమణ ప్రకటించామని చెప్పారు. ఆరు నెలలుగా తమ వైపు నుంచి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మరో ఆరు నెలలు కాల్పుల విరమణ పొడిగించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి భంగం కల్గించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) చూస్తోందని వారు ఆరోపించారు. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని నక్సల్స్ కోరారు.
Maoists | లొంగుబాట్లతో కలవరం
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ (Maoist Party) బలహీనం అయింది. ఓ వైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లు పార్టీనిక కలవర పెడుతున్నాయి. కొంతకాలంగా నూతన రిక్రూట్మెంట్లు లేవు. పార్టీ ఉన్న వారిని బలగాలు ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లలో మట్టుబెడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు ఇటీవల లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్‌చారి, ఆశన్న తమ అనుచరులతో ఆయుధాలు వీడారు. మరికొంత మంది సైతం లొంగిపోయే అవకాశం ఉంది.
