అక్షరటుడే, వెబ్డెస్క్ : మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపిన పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయం వీడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. భారత్ తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేయగా.. దాదాపు వంద మంది ఉగ్రవాదులు మృతి చెందారు.
Ceasefire | నిత్యం కాల్పుల మోత
భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడంతో పాకిస్తాన్రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల్లో గల సామాన్య పౌరులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. దీంతో జమ్మూ కశ్మీర్లో 15 మంది ప్రజలు మృతి చెందారు. నిత్యం బాంబుల మోతతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పాక్ దాడులను భారత్ తిప్పికొట్టినా.. ప్రజలు మాత్రం రాత్రయితే చాలా ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అని ఆందోళన చెందారు.
Ceasefire | రాత్రంతా చీకట్లోనే..
పాకిస్తాన్ రాత్రి పూట డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో రెండు రోజుల పాటు సరిహద్దు గ్రామాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రెండు రోజులు చిమ్మ చీకట్లోనే గడిపారు. లైట్లు వేస్తే మన కదలికలు శత్రు దేశానికి తెలిసి దాడులు చేసే అవకాశం ఉండటంతో అధికారులు బ్లాక్ అవుట్ విధించారు. గత మూడు రోజులుగా ఇలా తీవ్ర ఇబ్బందులు పడ్డ సరిహద్దు గ్రామాల ప్రజలు కాల్పుల విరమణతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Ceasefire | ఆ చర్చలే కీలకం..
పాకిస్తాన్ మిలిటరి జనరల్ శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదన తేవడంతో ఒప్పుకున్నట్లు భారత్ తెలిపింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు దేశాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అయితే ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మే 12న మరోసారి చర్చలు జరుపుతారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గడానికి ఆ చర్చలే కీలకం కానున్నాయి. ఆ సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒక ఒప్పందానికి వస్తే కాల్పులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే పాక్పై భారత్, పాక్పై భారత్ విధించిన ఆంక్షల విషయం కూడా చర్చించే అవకాశం ఉంది.