అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Solar Eclipse | మహాలయ అమావాస్య రోజున పితృ దేవతారాధన అనాదిగా వస్తోంది. అయితే ఈసారి అమావాస్య (సెప్టెంబర్ 21) రోజున సూర్యగ్రహణం (Solar Eclipse) కూడా ఉండడంతో ప్రజలలో అపోహలు వ్యాప్తి చెందుతున్నాయి. గ్రహణం ఉన్నందున పితృ దేవతలకు తర్పణాలు వదలరాదని, దానధర్మాలు చేయరాదని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అయితే గ్రహణం ఉన్నా పితృదేవతారాధన చేయాల్సిందేనని పేర్కొంటున్నారు గూడెం గ్రామానికి చెందిన ఆధ్యాత్మికవేత్త రుద్రమణి శివాచార్య. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు (Ancestors) తర్పణాలు వదిలేవారికి, దానాలు చేసేవారికి పితృదేవతా దోషాలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు. మహాలయ అమావాస్య, సూర్యగ్రహణాల గురించి ఆయన ఏం చెబతున్నారంటే..
మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) రోజున ఆచరించే శ్రాద్ధ కర్మల వల్ల పితృ దేవతలకు శాంతి, సద్గతులు కలుగుతాయి. ఆ రోజు సూర్యగ్రహణం (Surya Grahanam) ఉంది. అయితే ఆ గ్రహణం భారత దేశంలో కనిపించదు. దీంతో సాధారణంగా గ్రహణ సమయంలో ఆచరించే పవిత్ర కార్యాల నిలిపివేత వంటి నియమాలు వర్తించవు. సూతక కాలం కూడా ఉండదు. అందువల్ల పితృ అమావాస్యకు సంబంధించిన శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు యథావిధిగా చేసుకోవచ్చు, పితృ దోషాలు తొలగిపోవడానికి మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులు లేదా జంగమ దేవరలకు గుమ్మడికాయతో పాటు వస్త్ర దానం కూడా చేయాలి. ఉప్పు, ఇనుము, పత్తి, బియ్యం కూడా దానమివ్వాలి. గోవులకు ఆహారం అందిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.
Solar Eclipse | పాటించాల్సినవి..
సెప్టెంబర్ 21న అంటే ఆదివారం అమావాస్య తిథి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 21 రాత్రి 10:59 గంటలనుంచి 22వ తేదీ తెల్లవారుజామున 3:23 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించదు. యూరప్ (Europe), ఉత్తర అమెరికాలోని ప్రజలు కూడా ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఇది దక్షిణర్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్(New Zealand)తో పాటు అంటార్కిటికాలోనూ గ్రహణం కనిపిస్తుంది. కాగా మన దేశంలో సూర్యగ్రహణం కనిపించకపోయినా కొన్ని ఆచారాలను పాటించాలి. సూర్య గ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేయడం శుభప్రదం. గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేయాలి. ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. గ్రహణం వీడిన తర్వాత పేదవారికి, అవసరమైనవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుందని, శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.