అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Cabinet | తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళనపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరుగుతున్న మాట నిజమేనని, అయితే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. తనకు మాత్రం మంత్రివర్గంలోకి వెళ్లే ఆలోచన ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్ర మంత్రికి కూడా లేని ప్రాధాన్యం పీసీసీ అధ్యక్ష పదవికి ఉంటుందని పేర్కొన్న గౌడ్, అందుకే తాను పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాను పార్టీ బలోపేతం కోసం పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (AICC General Secretary KC Venugopal) మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని సూచించినప్పటికీ, తాను మాత్రం పార్టీ కోసం పనిచేయడమే ఇష్టమని చెప్పినట్లు వివరించారు.
Telangana Cabinet | ఇది నిజమా?
ఆదివారం రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) నిర్వహించిన ‘ఓట్ చోర్… గద్దీ ఛోడ్’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) పాలనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎంకు స్పష్టమైన విజన్ ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో హైదరాబాద్‌తో ఎవరూ పోటీ పడలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు బీసీలకు న్యాయం చేస్తోందని, డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు నిదర్శనమని గౌడ్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ నామినేటెడ్ పదవుల భర్తీని నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లకు సంబంధించిన వివాదాలు పూర్తిగా సద్దుమణిగాయని, ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం కూడా సంతృప్తిగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు మంత్రి పదవులు (Minister Posts) ఖాళీగా ఉన్నాయి. తొలి విడత విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌లకు అవకాశం దక్కగా, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు పదవుల కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.