అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cabinet Expansion | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (state cabinet expansion) త్వరలో చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
రాష్ట్రంలో ప్రస్తుతం 15 మంత్రులు ఉన్నారు. సీఎంతో కలిసి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 16. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మరో ఇద్దరిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గతంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) సైతం వ్యాఖ్యలు చేశారు. అయితే అది అధిష్టానం పరిధిలో ఉంటుందని తెలిపారు. తాజాగా దీనిపై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Cabinet Expansion | నాకు పదవి వస్తుంది
రామచంద్రు నాయక్ శుక్రవారం అసెంబ్లీ లాబీలో (Assembly lobby) మీడియాతో మాట్లాడారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. లంబాడి సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో లంబాడీలు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారన్నారు. కాగా టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన రామచంద్రునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో రెండు సార్లు ఓడిపోయారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న ఆయనను ప్రభుత్వ విప్‌గా గతంలో నియమించారు. అయితే తాజాగా ఆయన మంత్రివర్గంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Cabinet Expansion | కోమటిరెడ్డి సైతం..
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (MLA Rajagopal Reddy) సైతం ఇటీవల తనకు మంత్రిపదవి వస్తుందని చెప్పారు. పదవి రాలేదని కొన్ని రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్న ఆయన ఇటీవల సైలెంట్ అయ్యారు. అధిష్టానం నుంచి మంత్రి పదవి విషయంలో మరోసారి ఆయనకు హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎన్నికల అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పదవులు వరించాయి. అనంతరం జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌ను మంత్రిగా చేశారు. ప్రస్తుతం ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు. అయితే లంబాడా సామాజిక వర్గానికి చెందిన తనను మంత్రి చేయాలని రామచంద్రు నాయక్ కోరుతున్నారు.
Cabinet Expansion | కొందరిపై వేటు తప్పదా..
రాష్ట్రంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ కీలకం. ఈ క్రమంలో ఇక్కడ పార్టీ పట్టును నిలుపుకునేందుకు మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. పనితీరు సరిగా లేని వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.