Homeటెక్నాలజీBSNL | బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు.. భారీగా పెరిగిన కస్టమర్లు

BSNL | బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు.. భారీగా పెరిగిన కస్టమర్లు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎస్‌(BSNL) కస్టమర్లను పెంచుకుంటూ దూసుకుపోతోంది. 4G సేవలను కూడా అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ప్రైవేట్‌ సంస్థలకు పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: BSNL | గతేడాది ప్రైవేట్‌ టెలికాం ఆపరేటర్లు రీచార్జి ప్లాన్ల(Recharge plans)ను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది కస్టమర్లు ఆ సంస్థలనుంచి భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) లోకి పోర్ట్‌ అయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో అత్యధిక మంది కస్టమర్లను జోడించడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్ని ఇతర కంపెనీలను అధిగమించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఏడాది ఆగస్టులోనూ కొత్త సబ్‌స్క్రైబర్లు భారీగా చేరారు. ట్రాయ్‌(TRAI) నివేదిక ప్రకారం ఆగస్టులో కొత్త సబ్‌స్క్రైబర్ల చేరికలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ఎయిర్‌టెల్‌(Airtel)ను సైతం వెనక్కి నెట్టడం గమనార్హం. ఆగస్టులో 13.85 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లుగా చేరారు. ఎయిర్‌టెల్‌ 4.96 లక్షల మంది కొత్త కస్టమర్లను మాత్రమే జోడించడం గమనార్హం. 1.9 మిలియన్లకుపైగా కొత్త కస్టమర్లతో జియో(Jio) అగ్రభాగంలో ఉంది. కాగా ఇదే కాలంలో వొడాపోన్‌ ఐడియా సంస్థ 3.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోవడం గమనార్హం.

BSNL | మొదటి స్థానంలో జియో..

ట్రాయ్‌ డాటా ప్రకారం ఆగస్టు చివరి నాటికి దేశంలో టెలిఫోన్‌ చందాదారుల సంఖ్య 122.45 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు నెలతో పోల్చితే 45 లక్షలు ఎక్కువ. 500 మిలియన్లకుపైగా వినియోగదారులతో జియో దేశంలో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది. ఎయిర్‌టెల్‌కు 309 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు(Subscribers) ఉన్నారు. 127 మిలియన్ల కస్టమర్లతో వీఐ(VI) మూడో స్థానంలో ఉండగా.. 34.3 మిలియన్ల మంది సభ్యులతో బీఎస్‌ఎన్‌ఎల్‌ నాలుగో స్థానంలో ఉంది.

BSNL | 4జీ సేవలతో విస్తృత అవకాశాలు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గత నెలలో దాదాపు దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించింది. దీనికి తోడు తక్కువ ధరలో రీచార్జి ప్లాన్లను అందిస్తోంది. త్వరలోనే 5జీ సేవలనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇవి సానుకూలాంశాలు. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో ప్రభుత్వ రంగ టెలికాం(Telecom) సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.