అక్షరటుడే, హైదరాబాద్: BRS protests | తెలంగాణ వ్యాప్తంగా నేడు (ఆదివారం) నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. భారాస అధినేత కేసీఆర్పై రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపడుతున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఒక్కడిగా రాష్ట్ర సాధనకు బయలు దేరి అందర్నీ ఏక తాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్.. అని ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అలాంటి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ కక్ష సాధింపులను ప్రపంచమంతా చూస్తోందన్నారు.
కేసీఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు.. మంత్రులు కూడా అక్కడికి వెళ్లారన్నారు. సిట్ అధికారులు మాత్రం నంది నగర్ నివాసానికి వచ్చి గోడకు నోటిస్ అతికించి వెళ్లారు.. ఇది ఎవరిని కించపరిచేందుకు ఇలా చేశారని నిలదీశారు.
BRS protests | రాజకీయ కక్ష సాధింపు..
చట్టాన్ని గౌరవిస్తా.. విచారణకు సహకరిస్తా.. అని కేసీఆర్ చెప్పినా.. ఈ కక్ష సాధింపులు దేనికి? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ గారిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపును ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. విచారణ పై స్టే వచ్చేదని, అయినా చట్టాన్ని గౌరవించి కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా ఆదివారం (ఫిబ్రవరి 01) రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ఆందోళనల్లో స్వచ్చందంగా పాల్గొంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.