అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఓ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport)కు వస్తున్న (KLM-873) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను దింపేసి బాంబ్ స్క్వాడ్ (Bomb Squad), డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కాగా ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఫేక్ బెదిరింపులతో ప్రయాణికులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు నెలల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20కి పైగా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.
Bomb Threat | గతంలో సైతం..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ నెల 9న సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. మెయిల్ పంపిన వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు చెల్లించకపోతే విమానాన్ని పేల్చివేస్తామని హెచ్చరించాడు. దీంతో సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ భద్రతా సిబ్బంది (Airport Security Staff) వెంటనే చర్య తీసుకున్నారు, టెర్మినల్, కార్గో జోన్లు, పార్కింగ్ ప్రాంతాలు షెడ్యూల్ చేయబడిన అన్ని విమానాలలో తీవ్రమైన తనిఖీలు చేపట్టారు. కాగా ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court)కు సైతం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు.
బాంబు బెదిరింపుల్లో చాలా వరకు నకిలీవి ఉంటున్నాయి. అయినా కూడా అధికారులు ప్రతి బెదిరింపు విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఇలాంటి నకిలీ మెయిల్స్ (Fake Emails)తో ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమయం వృథా అవుతోంది. నకిలీ మెయిల్స్ పంపే వారిని అధికారులు పట్టుకోలేకపోతున్నారు. వీరు చాలా వరకు విదేశాల నుంచి మెయిల్స్ పంపుతున్నారు.