అక్షరటుడే, వెబ్డెస్క్ : Urea Shortage | తెలంగాణలో యూరియా కొరతకు కారణం బీజేపీయేనని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రానికి యూరియా ఇవ్వకుండా రైతులను రోడ్లపైకి తీసుకొస్తోందని మండపడ్డారు.
సోమవారం గాంధీభవన్(Gandhi Bhavan)లో విలేకరులతో మాట్లాడిన పొన్నం.. నాలుగు నెలలుగా యూరియా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత తలెత్తిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు ఏమాత్రం సహకరించడం లేదని, కావాలనే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Urea Shortage | సరఫరా చేయడం లేదు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Government) యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని పొన్నం ఆరోపించారు. బీజేపీ వల్లే యూరియా కొరత(Urea Shortage) ఏర్పడిందన్న ఆయన.. రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటిదాకా 5 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చిందని చెప్పారు. యూరియా ఉత్పత్తి తగినంత లేదని ఇవ్వడం లేదన్నారు. యూరియా సమస్యకు కారణమైన బీజేపీ నేతలను రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
Urea Shortage | బాధ్యత లేకుండా..
కేంద్రంలోని బీజేపీ నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని పొన్నం విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేని చెప్పారు. విత్తనాలు, విద్యుత్ లేదంటే తాము బాధ్యత వహిస్తామని, కానీ ఎరువులకు సంబంధించి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఎరువుల తయారీ, సరఫరా బాధ్యత అంతా కేంద్రానిదేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని. యూరియా కోసం చేయాల్సినవన్ని చేస్తున్నామని చెప్పారు. బాధ్యతలను విస్మరించడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.
Urea Shortage | బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?
రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం లాభమని నిలదీశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే, రాష్ట్ర రైతుల గోసను తీర్చాలని డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్రాన్ని బుజ్జగిస్తారా.. బెదిరిస్తారా.. ఏం చేస్తారో చేసి రైతులకు యూరియా ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష ఉంటే మా ప్రభుత్వంపై తీర్చుకోండి. అంతేకానీ రైతులను ఇబ్బందులు పెట్టొద్దని హితవు పలికారు. రైతులు రోడ్లపైకి రావడానికి కారణమైన బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని కోరారు. రైతులకు అవసరమైంత ఎరువులు అందించేలా రాష్ట్ర బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.