అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | కామారెడ్డి మున్సిపల్ ఓటరు జాబితాలో (Kamareddy municipal voter list) తప్పులను సరిచేయకుండా.. దొంగ ఓట్లను ఏరివేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారుల తీరుపై బీజేపీ భగ్గుమంది. ఈ మేరకు సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని (Kamareddy municipal office) నాయకులు ముట్టడించారు.
Kamareddy BJP | మున్సిపాలిటీలో హంగామా..
పట్టణంలోని మున్సిపాలిటీకి 12 గంటల సమయంలో చేరుకున్నారు. బీజేపీ నాయకులు మున్సిపల్ గేటును, పోలీసులను తోసుకుని కార్యాలయంలోనికి వెళ్లే ప్రయత్నం చేయగా కార్యాలయ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను తోసుకుని వెళ్లి కార్యాలయ డోర్లను బద్దలుకొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య భారీగా తోపులాట చోటుచేసుకుంది.

Kamareddy BJP | ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
బీజేపీ ముట్టడి సందర్భంగా ముందుగానే పోలీసులు మున్సిపాలిటీ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ మేరకు కార్యాలయానికి తరలివచ్చిన నాయకులను బయటకు తీసుకెళ్లారు. అయినా బీజేపీ నాయకులు తగ్గలేదు. సుమారు 50 నిమిషాల పాటు బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య భారీగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు సంతోష్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో ఆయనను పక్కన కూర్చోబెట్టి నీళ్లు తాగించారు. తోపులాట మధ్య పలువురు పోలీసులు, బీజేపీ నాయకులు కింద పడిపోయారు. బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీసు వాహనాలు, డీసీఎం వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు.

Kamareddy BJP | ఓటరు జాబితా సవరించేదాక వదిలిపెట్టేది లేదు..
తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించేదాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో తప్పులతో పాటు ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో అధికారులకు చెప్పినా క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా పాత జాబితానే మళ్లీ ప్రచురిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఓటరు జాబితా వివరాలు తెలుసుకుంటూనే ఉన్నామని, వార్డులో ఎవరు ఎక్కడి వాళ్ళో తమకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జాబితా సవరించేదాక ఎంతవరకైనా వెళ్లామని స్పష్టం చేశారు.
