అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bigg Boss 9 | తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ మరో సీజన్‌ను విజయవంతంగా ముగించింది. 105 రోజుల పాటు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలే ఘనంగా జరిగింది.
ఈ సీజన్లో సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల (Kalyan Padala) చరిత్ర సృష్టించారు. సెలబ్రిటీ కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. నటి తనూజ (Actress Tanuja) రన్నరప్‌గా నిలిచారు. విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాలకు మొత్తం రూ.35 లక్షల ప్రైజ్ మనీతో పాటు అదనంగా రూ.5 లక్షల చెక్ లభించింది. అంతేకాదు, బ్రాండ్ న్యూ మారుతి సుజుకీ విక్టోరిస్ కారు (Maruti Suzuki Victoris Car) కూడా ఆయన సొంతమైంది. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి ఈ స్థాయిలో విజయం సాధించడం బిగ్ బాస్ చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.
Bigg Boss 9 | అనుకున్నది సాధించాడు..
ఫైనల్ రేసులో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు నిలిచారు. ముందుగా నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో పోటీ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా భావించిన జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel) నాలుగో స్థానంతో ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం రూ.15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ (Demon Pawan) అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నారు. పవన్ నిష్క్రమణతో విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ రూ.50 లక్షల నుంచి రూ.35 లక్షలకు తగ్గింది. చివరకు అత్యధిక ఓట్లు సాధించిన కళ్యాణ్ పడాల టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ సీజన్‌తో మరోసారి బిగ్ బాస్ తెలుగు విజేతగా పురుషుడే నిలవడం గమనార్హం. ఇప్పటివరకు జరిగిన తొమ్మిది సీజన్లలోనూ పురుషులే విజేతలుగా నిలవడం విశేషం. సీజన్ వారీగా విజేతలను పరిశీలిస్తే సీజన్ 1లో శివ బాలాజీ, సీజన్ 2లో కౌశల్, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్, సీజన్ 5లో వీజే సన్నీ, సీజన్ 6లో రేవంత్ , సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, సీజన్ 8లో నిఖిల్ విజేతలుగా నిలిచారు. తాజాగా సీజన్ 9లో కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఈ జాబితాలో చేరారు.
బిగ్ బాస్ తెలుగు షో 2017లో ప్రారంభమైంది. తొలి సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. 2019 నుంచి ఇప్పటివరకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతూ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9, ఒక సామాన్యుడి విజయం ద్వారా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.