అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Bandh | రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) హై కోర్టు స్టే ఇవ్వడంతో బీసీ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ డిపో (RTC Depot)ల ఎదుట శనివారం తెల్లవారు జామున నాయకులు ధర్నాలు చేశారు. ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
BC Bandh | దుకాణాల మూసివేత..
రాష్ట్రంలో అన్ని వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో చాలా వరుకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు (Private Educational Institutions) ముందు రోజు సెలవు ఉంటుందని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కొనసాగగా.. బీసీ సంఘాల నేతలు మూసి వేయించారు.
BC Bandh | అన్ని పార్టీల నేతలు
బీసీ బంద్ (BC Bandh)లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్‌తో పాటు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బంద్‌కు మద్దతుగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. అంబర్‌పేటలో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ బంద్‌లో మంత్రులందరూ పాల్గొంటున్నారని చెప్పారు. తాము అడుగుతున్న కోరిక న్యాయమైనదని, ప్రజలు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు.
BC Bandh | దుకాణలపై దాడి
హైదరాబాద్ (Hyderabad) నగరంలోలో బీసీ బంద్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బంద్ పాటించని పలు దుకాణాలపై బీసీ సంఘాల నాయకులు రాళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నల్లకుంట ప్రాంతంలో నిరసనకారులు బజాజ్ షోరూమ్, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై రాళ్లు రువ్వారు.
BC Bandh | కిందపడిపోయిన వీహెచ్
బీసీ బంద్‌కు మద్దతుగా అంబర్‌పేటలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతురావు పాల్గొన్నారు. ర్యాలీలో ఆయన నడుస్తుండగా.. బ్యానర్ కాలికి అడ్డుతగలడంతో కింద పడిపోయారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. పక్కనే ఉన్న నాయకులు వెంటనే స్పందించి ఆయనను లేపారు.
BC Bandh | కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు టౌన్లో ఉద్రిక్తత చోటు చేసుకుది. బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. తొర్రూరు బస్టాండ్ వద్ద రెండు పార్టీల నేతలు ఎదురుపడడంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. అనంతరం ఎదురెదురుగా దూసుకొచ్చి, తోపులాటకు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.


