అక్షరటుడే, వెబ్‌డెస్క్: SP Suspended | కర్ణాటక (Karnataka)లోని బళ్లారిలో బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి (Congress MLA Bharat Reddy) వర్గాల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కాల్పులు చోటు చేసుకోగా.. ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ తాజాగా ఎస్పీ పవన్ నిజ్జూర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
వాల్మీకి విగ్రహావిష్కరణ (Valmiki Statue) కార్యక్రమానికి సంబంధించి బ్యానర్ల ఏర్పాటుతో వివాదం మొదలైంది. గాలి జనార్దన్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెకసీ ఏర్పాటుకు యత్నించగా.. ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులపై సైతం దాడి చేశారు. అనంతరం ఓ వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి (BJP MLA Gali Janardhan Reddy)వర్గంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రాజశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
SP Suspended | ఒక్కరోజులో ఎస్పీపై వేటు
ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అధికారులు బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ (Ballari SP Pawan Nijjoor)పై వేటు వేశారు. కాగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారమే అధికారులు సస్పెండ్ చేయడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంలో బ్యానర్ల ఏర్పాటు విషయంలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి, జనార్దన్‌రెడ్డితో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపై సైతం కేసు పెట్టారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) హితేంద్ర మాట్లాడుతూ.. ఈ ఘటనలో పలువురి నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులు గుంపుపై కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. వారిని చెదరగొట్టడానికి బాష్పవాయువును మాత్రమే ఉపయోగించినట్లు తెలిపారు.