అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Womens World Cup | మహిళల వన్డే ప్రపంచకప్(Womens World Cup) 2025లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా(Australia) చేతిలో 107 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇది పాకిస్థాన్(Pakistan)కు వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా, 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆసీస్ గత మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా ప్రారంభంలో కుదేలై 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ (114 బంతుల్లో 109; 11 ఫోర్లు), అలానా కింగ్ (49 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యంతో జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్‌కు ఫైటింగ్ స్కోరు అందించారు.
Womens World Cup | చెత్త ప్రదర్శనతో..
పాకిస్థాన్ బౌలర్లు ఆరంభంలో అద్భుత ప్రదర్శన కనబర్చారు.నష్రా సంధు 3/37, రమీన్ షమీమ్ 2/29, ఫాతిమా సనా 2/49, డయానా బైగ్, సదియా ఇక్బాల్ తలో వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియాను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ, మిడిల్ ఆర్డర్‌ను సమర్థంగా కట్టడి చేయలేకపోయారు. దాంతో ఆస్ట్రేలియా స్కోరు 200 పరుగుల మార్క్ దాటింది. ఇక 222 పరుగుల లక్ష్యాన్ని వెంబడించాల్సిన పాకిస్థాన్, 36.3 ఓవర్లలో కేవలం 114 పరుగులకే ఆలౌటై భారీ ఓటమిని మూటగట్టుకుంది. సిద్రా అమిన్ 35 పరుగులు చేసి పాకిస్తాన్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన చేశారు. కిమ్ గార్త్ 3/14, మేఘన స్కట్ 2/25, అన్నబెల్ సదర్లాండ్ 2/15, అలానా కింగ్, అష్లే గార్డనర్, జార్జియో వేర్‌హమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో బెత్ మూనీ (109 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్, భారత్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు ఓడి అట్టడుగు స్థానంలో ఉంది. చూస్తుంటే పాకిస్తాన్ ఈ టోర్నీలో కూడా తొందరగానే ఇంటిబాట పట్టనుందని అర్ధమవుతుంది.