అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంత్రులకు వివరించారు. జిల్లాలో ఈసారి 4.37 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 254 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. గత సీజన్లో 606 కేంద్రాలు ఉండగా ఈసారి 676 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు 1,582 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కలెక్టర్ కోరారు.
Collector Nizamabad | కేంద్రాల నిర్వహణ సజావుగా సాగాలి
కొనుగోలు కేంద్రాల (Purchasing Centers) నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 66.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ధాన్యం సాగుచేసినందున 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు చేతికందే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సుమారు 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున మద్దతు ధర చెల్లించడంతో పాటు సన్నరకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 బోనస్ అందించనుందని తెలిపారు.
ధాన్యం విక్రయించిన ఎనిమిది గంటల వ్యవధిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు ఉండేలా చూడాలని ముఖ్యంగా గన్నీ బ్యాగులు (Gunny Bags) తూకం యంత్రాలు టార్పాలిన్లు తేమ కొలిచే యంత్రాలు సరిపడా సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయా గౌడ్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, డీటీవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.