అక్షరటుడే, వెబ్‌డెస్క్:Nvidia | ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) కీలక ఒప్పందం చేసుకుంది. కృత్రిమ మేధ (ఏఐ)లో యువతకు నైపణ్య శిక్షణ అందించేందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ(Artificial Intelligence University) ఏర్పాటుకు ఎన్విడియా సహకరించనుంది. సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఎన్‌విడియాతో ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సమక్షంలో రాష్ట్ర ఉన్నత విద్యాధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా పదివేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇవ్వడంతో పాటు, 500 అంకుర పరిశ్రమలకు మద్దతు లభించనుంది. అలాగే, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్విడియా సహకారం అందించనుంది. మరోవైపు దేశంలోనే తొలిసారిగా క్వాంటం వ్యాలీ టెక్ పార్కు(Quantum Valley Tech Park)ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Nvidia | టెక్నాలజీకి పెద్దపీట..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ(Technology)కి పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీని భాగం చేసింది. వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్‌విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గతేడాది అక్టోబర్ నెలలో ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang)తో భేటీ అయ్యారు. ముంబయిలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా లోకేష్ జెన్సన్ హువాంగ్‌ను కోరారు.
ఎన్‌విడియా సీఈవో అప్పట్లో దీనికి అంగీకరించగా.. తాజాగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం, ఎన్‌విడియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో పది వేల మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు(engineering college students) అడ్వాన్స్‌డ్ ఏఐ మీద ట్రైనింగ్ అందించనున్నారు. దేశంలోనే అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ యూనివర్సిటీకి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లు, హార్డ్‌వేర్ సామర్థ్యాలను ప్రభుత్వం అందించనుంది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదిక కానుంది.
ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం టీసీఎస్(TCS), ఐబీఎం(IBM), ఎల్‌అండ్‌టీ(L&T) సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి కేంద్రంగా 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలి. మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం భూమిని కూడా కేటాయించారు. ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం ప్రాంతాల్లో క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించాలని మంత్రుల కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది.