అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ‘ఎన్టీఆర్ బేబీ కిట్’(NTR Baby Kit) పథకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఈ కిట్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు ఈ కిట్‌లో మార్పులు చేపట్టబడ్డాయి.
ఇప్పటి వరకు 11 వస్తువులు మాత్రమే ఉండగా, ఇప్పుడు రెండు కొత్త వస్తువులు చేర్చారు. ఫోల్డబుల్ బెడ్ మరియు ఒక బ్యాగ్ చేర్చడంతో మొత్తం వస్తువుల సంఖ్య 13కి చేరింది. ఈ మార్పు కారణంగా ఒక్కో కిట్ ఖర్చు రూ.1,504 నుంచి రూ.1,954కి పెరిగింది. అంటే అదనంగా రూ.450 ఖర్చు అవుతుంది.
AP Government | వారికి శుభవార్త..
గతంలో ఈ కిట్‌లో దోమతెర పరుపు, వాటర్‌ప్రూఫ్ షీటు, దుస్తులు, న్యాప్కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ వంటివి ఉండేవి. ఇప్పుడు కొత్త వస్తువుల చేరికతో తల్లులు, శిశువులకు మరింత సౌకర్యం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.ప్రతి సంవత్సరం సుమారు 3.20 లక్షల మంది తల్లులకు ఈ కిట్లు అందించే ప్రణాళిక ఉంది. ఇందుకోసం APMSIDC ద్వారా సుమారు రూ.65 కోట్ల అంచనా వ్యయంతో కొత్త టెండర్లు పిలవనున్నారు. గత జూన్‌లో టెండర్లు పిలిచినా, ఇప్పుడు అదనపు వస్తువులు చేర్చడం వల్ల మళ్లీ కొత్త టెండర్లు అవసరమయ్యాయి. ఈ టెండర్ల ఆధారంగా 26 జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్‌లకు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు సంవత్సరాల పాటు సరఫరా జరగనుంది.
2016లో టీడీపీ ప్రభుత్వం(TDP Government) ఈ పథకాన్ని ప్రారంభించగా, శిశు ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తుందని అప్పట్లోనే విశేష ఆదరణ పొందింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కొంతకాలం కొనసాగించిన తర్వాత నిలిపివేసింది. ఇప్పుడు కొత్త కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించడంతో, తల్లులకు, శిశువులకు ఆరోగ్య పరిరక్షణలో ఇది మళ్లీ కీలకంగా మారనుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే టెండర్లు పూర్తి చేసి త్వరలోనే ఎన్టీఆర్ బేబీ కిట్‌లను పంపిణీ చేయనుంది.