Pakistan Defense Minister
Pakistan Defense Minister | యుద్ధాలు తెచ్చి లాభ‌ప‌డ‌డ‌మే అమెరికా ప‌ని.. పాక్ ర‌క్ష‌ణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan Defense Minister | పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Pakistan Defense Minister Khawaja Asif) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికానే (America) యుద్ధాల‌ను ప్రేరేపిస్తోంద‌ని ఆరోపించారు. దేశాల‌ను రెచ్చ‌గొడుతూ యుద్ధాల‌ను తీసుకురావ‌డం ద్వారా భారీగా లాభాలు ఆర్జిస్తోంద‌ని ఆరోపించారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఆసిఫ్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌తో (operation sinddor) తీవ్రంగా వ‌ణికిపోయిన పాకిస్తాన్ అమెరికా శ‌ర‌ణు వేడింది. భార‌త్ దాడుల (India Attacks) నుంచి ర‌క్షించాల‌ని కాళ్లావేళ్లా ప‌డింది. చివ‌ర‌కు భార‌త్ వ‌ద్ద‌కు వ‌చ్చి మోకాళ్ల‌పై నిల‌బ‌డి ప్రాధేయ‌ప‌డింది. దీంతో భార‌త్ కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించింది.

Pakistan Defense Minister | అమెరికా వల్లే సంఘ‌ర్ష‌ణ‌లు..

ఇండియా చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ (Pakistan) బుద్ధి మార‌డం లేదు. త‌ర‌చూ భార‌త్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కే పొరుగు దేశం ఇటీవ‌ల కొన్ని వాస్త‌వాల‌ను అంగీక‌రించ‌డం మొద‌లు పెట్టింది. అమెరికా (America) వ‌ల్లే త‌మ ప‌రిస్థితి ఇలా త‌యారైంద‌ని, పాశ్చాత్య దేశాలు చెప్పిన‌ట్లు చేయ‌డం వ‌ల్లే తాము ఈ స్థాయికి దిగ‌జారామని ఇటీవ‌ల పాక్ మంత్రులు (Pakistan ministers) కొత్త పాట అందుకున్నారు. తాజాగా అవే మాట‌ల‌ను ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిప్ పున‌రుద్ఘాటించారు. గత శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నిటికీ అమెరికానే కారణమని అన్నారు.

Pakistan Defense Minister | ఆయుధ లాబీ వ‌ల్లే..

అమెరికాకు చెందిన ఆయుధ ప‌రిశ్ర‌మ (US arms industry) వ‌ల్లే దేశాల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తుతున్నాయ‌ని ఆసిఫ్ ఆరోపించారు. ‘‘గత 100 ఏళ్లల్లో అమెరికా (America) ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను సృష్టించింది. వాళ్లు 260 యుద్ధాల్లో పాల్గొన్నారు. చైనా (China) కేవలం మూడు యుద్ధాలను మాత్రమే చేసింది. ఈ యుద్ధాలతో అమెరికా లాభపడుతోంది. ధనం ఆర్జిస్తోంది. అక్కడి ఆయుధ తయారీ పరిశ్రమ చాలా శక్తిమంతమైనది. వేళ్లూనుకుపోయి ఉన్నది. అమెరికా జీడీపీలో (America GDP) అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతుంది. అందుకే వారు యుద్ధాలను రెచ్చగొడుతుంటారు’’ అని వ్యాఖ్యానించారు.

సిరియా (Syria), ఆఫ్ఘనిస్థాన్, లిబియా (Afghanistan and Libya) వంటి దేశాల్లో ఒకప్పుడు సుసంపన్నమైనవని. సుదీర్ఘ యుద్ధాల కారణంగా సర్వనాశనమైపోయాయని గుర్తు చేశారు. అవి దివాలా తీశాయని, అమెరికా వల్లే ఆ దేశాలు పతనమయ్యాయని తెలిపారు. ప్రత్యర్థి దేశాలు రెండిటితోనూ అమెరికా ఆటలు ఆడుతుంటుందని విమ‌ర్శించారు. అస్థిరత వివాదాలపైే అమెరికా యుద్ధ పరిశ్రమ (US war industry) బతుకుతుంటుందని ఆరోపించారు.

ఆసిఫ్ వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాక్ మిలిటరీ (Pakistan military) కూడా అమెరికా నిధులు, ఆయుధాలను తీసుకుంటోంద‌ని, మ‌రీ ఆ దేశాన్ని విమ‌ర్శించ‌డం ఏమిట‌ని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. ‘‘పాక్‌కు సాయం కావాల్సి వచ్చినప్పుడు అమెరికా ముందు సాగిలపడుతుంది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాబట్టి మళ్లీ అమెరికాను తిట్టిపోస్తోంది’’ అని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.