అక్షరటుడే, ఇందూరు: Nizamabad Market Yard | ఆమ్‌చూర్‌కు పెట్టింది పేరు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ (Nizamabad Agricultural Market Yard). రాష్ట్రంలోనే అత్యధిక మార్కెట్ ఇక్కడే జరుగుతుంది. అయితే ఆమ్చూర్ రైతులు ఈ ఏడాది ఇబ్బందుల్లో పడ్డారు. ధర లేక దిగాలు పడుతున్నారు. గతేడాదితో పోల్చితే సగానికి ధర పడిపోయిందని వాపోతున్నారు.
ఆమ్‌చూర్‌ను ఎక్కువగా ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల రైతులు పండిస్తున్నారు. తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్ యార్డ్ అయిన నిజామాబాద్‌కు తరలిస్తారు. నాణ్యతను బట్టి మద్దతు ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి ప్రతిరోజు సుమారు 500 క్వింటాళ్లు మార్కెట్ కు వస్తోంది. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి మద్దతు ధర తగ్గిందని రైతులు వాపోతున్నారు. క్వింటాలుకు సుమారు రూ.7 నుంచి 10వేల వరకు వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. గతేడాది రూ.25 వేలు పలికిన ఆమ్చూర్ ధర ఈ ఏడాది ఏకంగా రూ.18 వేలకు పడిపోయింది.
Nizamabad Market Yard | గిట్టుబాటు కావట్లేదు..
ఆమ్చూర్ తీసుకొచ్చే రైతుల్లో ఎక్కువగా కౌలుకు తీసుకున్న వారే ఉన్నారు. మామిడి చెట్లను కౌలుకు తీసుకొని యజమానికి ఒక్కో చెట్టుకు రూ.10 నుంచి 15 వేల వరకు చెల్లిస్తున్నారు. అలాగే మార్కెట్ యార్డుకు తరలించడానికి ట్రాన్స్పోర్ట్, మామిడి నుంచి తోలు తీయడానికి కూలి.. ఇలా అన్నిరకాల ఖర్చులు పెరిగాయి.
Nizamabad Market Yard | అకాల వర్షంతో..
ఏడాది ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు పడ్డాయి. దీంతో చాలావరకు మామిడికాయలు నేల రాలిపోయాయి. అలాంటి కాయ నుంచి తీసిన ఆమ్‌చూర్‌కు నాణ్యత లేదంటూ మద్దతు ధర తగ్గించేశారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది.
గతేడాదితో పోలిస్తే తక్కువే..
– అబ్రార్, పిట్లం
నేను రెండు చెట్లను కౌలుకు తీసుకొని ఆమ్చూర్ గీస్తాను. గతేడాది రూ.16వేలు పలికింది. ఈసారి మాత్రం కేవలం రూ.8 వేలకు పడిపోయింది. పిట్లం నుంచి ఇక్కడికి తీసుకురావడానికే రూ.4వేలు ఖర్చయ్యింది.
బహిరంగంగా ధర నిర్ణయించాలి
– రాజశేఖర్, మెదక్
నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్నామని కొనుగోలుదారులు చెబుతున్నారు. అందరి ముందు పాట పాడి ధర నిర్ణయిస్తే బాగుంటుంది. మాకు తెలియకుండానే మద్దతు ధర నిర్ణయించి ప్రకటిస్తున్నారు. ఈసారి ఏమాత్రం గిట్టుబాటు కాలేదు.
రైతు గోస పట్టడం లేదు
– బాగవ్వ, మోర్తాడ్
రైతుల కష్టం ఎవరికీ పట్టడం లేదు. నేను మూడేళ్లుగా ఆమ్‌చూర్‌ను తీసుకొస్తున్నాను. ఈసారి అతి తక్కువగా పలికింది. రోజంతా ఎదురు చూస్తే చివరికి నిరుత్సాహమే మిగిలింది.


