అక్షరటుడే, వెబ్‌డెస్క్: SI Arrest | హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ ఎస్సై భానుప్రకాశ్‌రెడ్డిని (Sub-Inspector Bhanu Prakash Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రివాల్వర్ తాకట్టు పెట్టాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.
అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ (Amberpet Police Station)లో భాను ప్రకాశ్ ఎస్సైగా పని చేసేవాడు. ఆయన బెట్టింగ్‌ల బారిన పడి అప్పుల పాలు అయ్యాడు. అనంతరం ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారాన్ని సొంతానికి వాడుకున్నాడు. అంతేగాకుండా సదరు ఎస్సై గన్ కూడా కనిపించకుండా పోయింది. దీనిపై ఆరా తీయగా.. గన్ను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆయనపై గతంలో కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ (suspended) చేశారు. తాజాగా ఎస్సైని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
SI Arrest | రివాల్వర్ ఏమైనట్లు
ఎస్సై రివాల్వర్ మాయం అయిన ఘటన నవంబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారం ఆయన సొంతానికి వాడుకున్నాడు. దానిపై విచారణ చేస్తుండగా.. ఎస్సై గన్ లేదని అధికారులు గుర్తించారు. అయితే సదరు ఎస్సై బెట్టింగ్‌కు బానిస అయినట్లు సమాచారం. ఈ క్రమంలో భారీగా అప్పులు కావడంతో తుపాకీని తాకట్టు పెట్టినట్లు తెలిసింది. అయితే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
గతంలో పోలీసులు భాను ప్రకాశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా పోయిందని ఓ సారి చెప్పాడు. విజయవాడలో ఓ లాడ్జిలో పుస్తకాల దగ్గర పెట్టుకున్నప్పుడు కనిపించకుండా పోయిందని మరోసారి చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో మాత్రం లాడ్జీలో పోయినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ఆయన తన రివాల్వర్ అమ్మేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే గన్ ఏమైందనే విషయం మాత్రం ఇప్పటికి తెలియడం లేదు.