Homeటెక్నాలజీAI Toilets | టాయిలెట్‌లో కూర్చుంటే హెల్త్‌ రిపోర్ట్..సెన్సేషన్ సృష్టిస్తున్న AI స్మార్ట్ టాయిలెట్లు

AI Toilets | టాయిలెట్‌లో కూర్చుంటే హెల్త్‌ రిపోర్ట్..సెన్సేషన్ సృష్టిస్తున్న AI స్మార్ట్ టాయిలెట్లు

ఒక్కసారి ఆలోచించండి .. టాయిలెట్‌లో కూర్చున్నప్పుడే మీ ఆరోగ్యం మీ మొబైల్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుందంటే… టెక్నాలజీ ఎంత ముందుకెళ్లిందో ప్ర‌త్యేకంగా చెప్పాలా? ఇక నుండి టాయిలెట్‌లో కూర్చుంటే హెల్త్ రిపోర్ట్ వ‌చ్చేస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: AI Toilets | ఉదయం టాయిలెట్‌కు వెళ్ళడం ఇక సాధారణ అలవాటు మాత్రమే కాకుండా , ఒక ఆరోగ్య తనిఖీ ప్రక్రియగా మారబోతోంది. ఆధునిక AI టెక్నాలజీ ఆధారంగా రూపొందిస్తున్న స్మార్ట్ టాయిలెట్లు (Smart Toilets) ఇప్పుడు మీ ప్రేగు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, హెల్త్‌టెక్ స్టార్టప్‌లు అభివృద్ధి చేస్తున్న ఈ టాయిలెట్లు మల, మూత్ర విశ్లేషణ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తాయి. వీటిలో అత్యాధునిక సెన్సార్లు, కెమెరాలు, AI అల్గారిథమ్‌లు అమర్చబడి ఉంటాయి. మల విసర్జన జరిగాక టాయిలెట్‌లోని కెమెరాలు మలం రంగు, ఆకారం, పరిమాణం, గట్టిదనం వంటి వివరాలను చిత్రీకరిస్తాయి.

AI Toilets | టెక్నాల‌జీ మాయ‌..

తర్వాత AI వ్యవస్థ ఈ డేటాను విశ్లేషించి, ‘ బ్రిస్టల్ స్టూల్ ఫామ్ స్కేల్ ’ ఆధారంగా ఫలితాలను వర్గీకరిస్తుంది. మలంలో రక్తం లేదా ఇతర అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వినియోగదారునికి హెచ్చరిక పంపిస్తుంది. మూత్ర ప్రవాహం, హైడ్రేషన్ స్థాయిలను కూడా కొలిచి వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సూచనలు ఇస్తుంది. సేకరించిన డేటా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లకు ఎంతో ఉపయోగపడుతుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక సమస్యలను పర్యవేక్షించడంలో ఇది కీలకం అవుతుంది. స్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్ సంస్థ టోటో (Japan Company Toto) ముందడుగు వేసింది. వారి టెక్నాలజీ ప్రకారం, కమోడ్‌లో అమర్చిన సెన్సార్‌ మలం రంగు, ఆకారం, పరిమాణాన్ని గుర్తించి స్మార్ట్‌ఫోన్ యాప్‌కి రిపోర్ట్ పంపిస్తుంది.

ఈ యాప్‌ రోజువారీ డేటాను “స్టూల్ కేలండర్” (Stool Calendar) రూపంలో భద్రపరుస్తూ, ఆరోగ్య మార్పులను ట్రాక్‌ చేస్తుంది. అలాగే, జీవనశైలిలో మార్పులు చేయాల్సిన సందర్భాల్లో సూచనలు కూడా ఇస్తుంది. ఆరోగ్యంపై అవగాహన కలిగిన వారు మాత్రమే కాకుండా, వృద్ధులు, ఆసుపత్రి రోగులు వంటి వారికి ఈ టెక్నాలజీ మరింత ఉపయోగకరం అవుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, భవిష్యత్తులో ఈ స్మార్ట్ టాయిలెట్లు కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులను మొదటి దశలోనే గుర్తించే స్క్రీనింగ్ పరికరాలుగా మారే అవకాశం ఉంది.