అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Artificial intelligence | కృత్రిమ మేధా (ఏఐ) కొలువుల్లో కోత పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న మల్టీ నేషన్ కంపెనీలు (Multinational Companies) ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తున్నాయి.
లక్షలాది ఉద్యోగులకు ఊడబీకుతున్నాయి. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు వేలాది మందిని తొలగించగా, తాజాగా అమేజాన్ (Amazon) కూడా అదే బాటలో చేరింది. ఇటీవల 14 వేల మందిని ఇంటికి పంపించేసింది. కొద్దిరోజులుగా కృత్రిమ మేధా విస్తరిస్తున్న కొద్దీ లేఆఫ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఒకటి, రెండు కాదు.. దాదాపు మెజార్టీ సంస్థలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి.
Artificial intelligence | భారీగా తొలగింపులు..
అంతర్జాతీయ దిగ్గజాలుగా పేరొందిన అనేక కంపెనీలు లేఆఫ్‌ల బాట పట్టాయి. ఏఐ (Artificial Intelligence) రాకతో మానవ వనరులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. భారీ వేతనాలతో కూడిన సిబ్బందిని ఇంటికి పంపించేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగమే కాదు, మానుఫ్యాక్చరింగ్, సర్వీస్, హెల్త్‌కేర్ తదితర సెక్టార్లలో ఉద్యోగుల కోత భారీగా కనిపిస్తోంది. లాజిస్టిక్స్ దిగ్గజం యూపీఎస్ గత సంవత్సరం నుంచి 48,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 ప్రారంభంలో UPSలో 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2024లో నిర్వహణ బృందంలో 14,000 మందిని తొలగించారు. ఈ సంవత్సరం డ్రైవర్, గిడ్డంగి విభాగాలలో 34,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. తొలి విడుతలో భారీగా సిబ్బందిని తొలగించిన అమెజాన్.. ఇటీవల 14 వేల మందిని ఇంటికి పంపించింది. ఇంటెల్‌లో 24,000, నెస్ట్లెలో 16,000, యాక్సెంచర్‌లో 11,000, ఫోర్డ్‌లో 11,000, నోవో నార్డిస్క్‌లో 9,000, మైక్రోసాఫ్ట్‌లో 7,000, ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌లో 5,600, సేల్స్‌ఫోర్స్‌లో 4,000 ఉద్యోగాల తొలగింపునకు చర్యలు చేపట్టాయి.
Artificial intelligence | జస్ట్ మెసేజ్..
భారీగా ఉద్యోగులను ఇంటికి పించిన అమేజాన్ అందుకు అనుసరించిన తొలగింపు విధానం చర్చనీయాంశమైంది. ఒకేసారి 14,000 మంది ఉద్యోగును తొలగించే క్రమంలో అనుసరించిన వైఖరిపై విమర్శలకు తావిచ్చింది. కేవలం టెక్ట్స్ మెసేజ్ ద్వారా వారిని రిలీవ్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మంగళవారం తమ ఉద్యోగాల తొలగింపును తెలియజేయడానికి రెండు మెసేజ్‌లను పంపింది. ఆఫీస్‌కు వచ్చే ముందు తమ వ్యక్తిగత లేదా అధికారిక ఈమెయిల్‌లను తనిఖీ చేయాలని ఒక టెక్స్ట్ మెసేజ్‌లో సూచించింది. తమ ‘రోల్’ గురించి ఈమెయిల్ మెసేజ్ రానివారు హెల్ప్ డెస్క్ కాల్ చేయాలని రెండో మెసేజ్‌లో పేర్కొంది.ఉద్యోగం పోయినవారు కార్యాలయానికి వచ్చి తమ యాక్సెస్ బ్యాడ్జ్‌లు పనిచేయకపోవడం చూసి ఇబ్బంది పడకుండా ఉండేందుకే అమెజాన్ ఈ పద్ధతిని ఎంచుకుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల వేతనం, బెనిఫిట్స్ అందించనున్నట్లు అమేజాన్ పేర్కొంది.
Artificial intelligence | భారీగా ఖర్చయినా కూడా..
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల నుంచి స్టార్టప్ కంపెనీ (Startup Company)ల వరకూ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. మానవ వనరుల అవసరం లేకుండా కృత్రిమ మేధాతో పనులు జరిగి పోతున్న తరుణంలో కంపెనీలు అటువైపే దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపునకు సిద్ధపడుతున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఖర్చులను కొనసాగించే బదులు ప్రస్తుతం ఒకేసారి ఆర్థిక భారాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నాయి. లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీలు.. సిబ్బందికి భారీ మొత్తంలో చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి. ఇందుకు గాను పెద్ద మొత్తంలో ఖర్చవుతున్నా గానీ లెక్క చేయకుండా ఉద్యోగుల తొలగింపునకే మొగ్గు చూపుతున్నాయి. టీసీఎస్ తమ ఉద్యోగుల తొలగింపు కోసం దాదాపు రూ.1135 కోట్లు ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్ధపడింది. యాక్సెంచర్ గత మూడేళ్లలో సెవెరెన్స్ కోసం 2 బిలియన్లకు పైగా ఖర్చు చేసింది. తొలగింపుల తాజా వేగం కేవలం ఖర్చులను తగ్గించుకోవడం కోసం మాత్రమే కాదని, కృత్రిమ మేధస్సు లోతుగా అనుసంధానించడం ద్వారా శ్రామికశక్తిని క్రమబద్ధీకరించడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి మరింత పెరుగనున్న తరుణంలో భారీగా లేఆఫ్‌లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

