అక్షరటుడే, వెబ్డెస్క్ : Taliban Domestic Violence Law | అఫ్గానిస్థాన్ (Afghanistan)లో తాలిబన్ల పాలనలో మహిళల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కనీసం బయట తిరిగే స్వేచ్ఛ సైతం అక్కడి మహిళలకు లేదు. బాలికల చదువు, సినిమాలు చూడడం, ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలుచేస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా గృహహింసను చట్టబద్ధం చేసేశారు. అఫ్గాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా (Hibutullah Akhundzada) ఆమోదించిన 90 పేజీల కొత్త క్రిమినల్ కోడ్.. మహిళల విషయంలో భర్తలకు ఉన్న అధికారాన్ని ఇది సమర్థిస్తోంది. దీని ప్రకారం భార్యాబిడ్డలను కొట్టండం గహ హింస కిందకు రాదు. ఎముకలు విరగకపోతే నేరం కాదు. రక్తస్రావం కానంతవరకు ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హమైన చర్య కాదు. గతంలో మహిళల రక్షణ కోసం ఉన్న 2009 నాటి చట్టాలను తాలిబన్లు (Talibans) పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో తీసుకువచ్చిన నూతన చట్టం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Taliban Domestic Violence Law | నేరం రుజువు చేయడమూ కష్టమే..
తాలిబన్లు తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం భర్త తన భార్యపై శారీరక శిక్షను ప్రయోగించవచ్చు. ఒకవేళ ఆ హింసలో ఎముకలు విరిగినా లేదా తీవ్రమైన గాయాలైనా.. భార్య ఆ విషయాన్ని కోర్టులో నిరూపిస్తే తప్ప భర్తకు శిక్ష పడదు. ఒకవేళ నేరం రుజువైనా 15 రోజుల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినపుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకొనే ఉండాలి. ఇది సాధ్యమయ్యే పనికాకపోవడంతో నేరం రుజువు కావడం అసాధ్యం.
Taliban Domestic Violence Law | భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లినా..
మహిళల కదలికలపైనా నూతన చట్టంలో కఠిన ఆంక్షలు విధించారు. భర్త అనుమతి లేకుండా భార్య పుట్టింటికి, లేదా బంధువుల ఇంటికకి వెళ్లడమూ నేరమే.. ఈ తప్పుకు మూడు నెలల జైలు శిక్ష తప్పదు.
Taliban Domestic Violence Law | సామాజిక హోదాను బట్టి శిక్షలు..
కొత్త శిక్షాస్మృతిలో అఫ్గాన్ సమాజాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. అంటే సామాజిక హోదాను బట్టి శిక్షలు ఉంటాయన్న మాట. మత పెద్దలు లేదా ఉన్నత వర్గాలకు చెందిన వారు తప్పు చేస్తే సలహా ఇచ్చి వదిలేస్తారు. కానీ సామాన్య, దిగువ తరగతి ప్రజలు తప్పు చేస్తే మాత్రం జైలు శిక్ష (Prison Sentence)తో పాటు కొరడా దెబ్బలు తినాల్సిందే. ఈ చట్టంలో క్రూరత్వానికి అద్దం పడుతోంది.