అక్షరటుడే, వెబ్డెస్క్: Fire safety inspection | హైడ్రా అధికారులు (HYDRAA officials) కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఫైర్ సేఫ్టీ తనిఖీలకు నెల రోజులు విరామం ఇస్తున్నట్లు తెలిపారు.
నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో (Bachcha’s Furniture store) ఇటీవల ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా దుకాణంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ చేయడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ప్రమాదం అనంతరం హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్ని మాపక శాఖ అధికారులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. అగ్ని మాపక శాఖ నిబంధనలు పాటించని దుకాణాలపై కొరఢా ఝుళిపించారు. గురువారం రెండు షాపులను, శుక్రవారం ఆరు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు.
Fire safety inspection | వ్యాపారులతో సమావేశం
హైడ్రా తనిఖీలతో వ్యాపారులు హడలెత్తిపోయారు. ఈ క్రమంలో శనివారం హైడ్రా కార్యాలంలో పలువురు దుకాణ యజమానులు, వ్యాపార సంఘాల నాయకులు అధికారులతో సమావేశం అయ్యారు. అగ్ని మాపక నిబంధనలు పాటిస్తామని కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) వారికి ఊరటనిచ్చారు. నెల రోజుల పాటు తనిఖీలను నిలిపి వేస్తామన్నారు. ఆలోగా అన్ని నిబంధనలు పక్కాగా అమలు చేయాలని, ఫైర్ సేఫ్టి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రేస్ పీరియడ్ తర్వాత ఉల్లంఘించిన వారిపై కఠినమైన తనిఖీలు, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల సీజ్ చేసిన దుకాణాలను సైతం అఫిడవిట్లు సమర్పించిన అనంతరం తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడితే సహించమని స్పష్టం చేశారు.
Fire safety inspection | మళ్లీ తనిఖీలు చేస్తారా!
నెల రోజుల తర్వాత మళ్లీ తనిఖీలు చేపడతారా.. లేక మళ్లీ ప్రమాదం జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తారా అని నగర వాసులు చర్చించుకుంటున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు, దర్యాప్తులు, తనిఖీల పేరిట హంగామా చేసే అధికారులు వారం పది రోజులకు మరిచిపోతారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫైర్సేఫ్టి నిబంధనల విషయంలో సైతం రెండు రోజులు తనిఖీలు చేసి నెల విరామం ఇవ్వడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులకు విరామం ఇవ్వాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ నెల రోజుల్లో ప్రమాదాలు జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రానున్నది వేసవి కావడంతో అగ్ని ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.