అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ KKR, పంజాబ్ కింగ్స్PBKS మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. భారీ గాలులతో వర్షం పడటంతో పూర్తి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ PBLS నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83), ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/34) రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం కేకేఆర్ తొలి ఓవర్‌లో 7 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
IPL 2025 | పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ రద్దవడంతో 11 పాయింట్స్‌తో పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఇంకా 5 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు విజయాలు సాధిస్తే పంజాబ్ ఖాతాలో 17 పాయింట్లు చేరుతాయి. అప్పుడు ఏ జట్టుతో సంబంధం లేకుండా పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. అలా కాకుండా రెండు విజయాలు సాధిస్తే 15 పాయింట్స్‌తో ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ఇంటి దారి పడుతోంది.
IPL 2025 | కేకేఆర్ ఔట్..
తాజా మ్యాచ్ రద్దవ్వడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. కేకేఆర్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలే సాధించింది. ఒక మ్యాచ్ రద్దవ్వడంతో 7 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ ఐదింటికి ఐదు గెలిస్తేనే 17 పాయింట్లతో టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఒక్క మ్యాచ్ ఓడితే 15 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే మాత్రం 13 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.