అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists Surrender | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో తాజాగా 26 మంది నక్సల్స్ లొంగిపోయారు.సుక్మా జిల్లాలో బుధవారం 26 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో 13 మందిపై రూ. 65 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఇందులో ఏడుగురు మహిళలు ఉన్నారు.
“పూనా మార్గెం” (పునరావాసం నుంచి సామాజిక పునరేకీకరణ వరకు) కార్యక్రమం కింద సీనియర్ పోలీసు, సీఆర్‌పీఎఫ్ అధికారుల (CRPF Officers) ముందు వీరు లొంగిపోయారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ (SP Kiran Chavan) తెలిపారు.
Maoists Surrender | అనేక ఘటనల్లో పాత్ర
లొంగిపోయిన మావోయిస్టులు పీఎల్‌జీఏ బెటాలియన్ (PLGA Battalion), సౌత్ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఆంధ్ర ఒడిశా సరిహద్దు డివిజన్‌లో చురుకుగా ఉన్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మాడ్, సుక్మా, ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో జరిగిన అనేక హింసాత్మక సంఘటనలలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో కంపెనీ పార్టీ కమిటీ సభ్యురాలు లాలీ అలియాస్ ముచాకి ఆయతే లఖ్ము (35) కూడా ఉన్నారు. ఆమె తలపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. 2017లో కోరాపుట్ రోడ్డు (ఒడిశా)లో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడు జరిపిన ఘటనతో సహా అనేక ప్రధాన హింసాత్మక ఘటనలలో ఆమె పాల్గొంది. ఆ పేలుడులో 14 మంది భద్రతా సిబ్బంది మరణించారని ఎస్పీ తెలిపారు.
Maoists Surrender | లొంగిపోయింది వీరే
హేమ్లా లఖ్మా (41), ఆస్మిత అలియాస్ కమ్లు సన్నీ (20), రాంబతి అలియాస్ పదం జోగి (21), సుందమ్ పాలే (20) అనే మరో నలుగురు కీలక నక్సల్స్‌పై ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. 2020లో జరిగిన మిన్పా మెరుపుదాడి (సుక్మా)లో లఖ్మా పాల్గొంది. ఈ దాడిలో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లొంగిపోయిన ఇతర మావోయిస్టుల్లో ముగ్గురిపై రూ.5 లక్షల చొప్పున, ఒకరిపై రూ. 3 లక్షలు, మరొకరిపై రూ. 2 లక్షలు, ముగ్గురిపై ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని ఆయన చెప్పారు. సరెండర్ అయిన వారికి తక్షణ సాయం కింద రూ.50 వేల సహాయం అందించామన్నారు.