అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Betting App Case | మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్(Yuvraj Singh) మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBet తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ ఆల్‌రౌండర్ మంగళవారం ఈడీ కార్యాలయానికి(ED Office) వచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో అధికారులు ఆయనను ప్రశ్నించారు. గేమింగ్ యాప్‌లతో జరిపిన లావాదేవీలపై ఆరా తీశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(Online Betting App)లకు సంబంధించిన కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్పలను ఈడీ ఇప్పటికే విచారించింది. తాజాగా యువరాజ్‌ను ప్రశ్నించింది.
Betting App Case | కోట్లు కొల్లగొట్టిన బెట్టింగ్ యాప్‌లు..
దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రముఖులతో ప్రమోట్ చేయించిన యాప్ నిర్వాహకులు యువకులను ఆన్‌లైన్ బెట్టింగ్ వైపు నడిపించారు. ఈ క్రమంలో కోట్ల కొద్దీ డబ్బులు పోగేసుకున్న నిర్వాహకులు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసగించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆస్తులు పోగొట్టుకోవడం, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) వీటిని నిషేధించింది. మరోవైపు, యాప్‌ల ద్వారా జరిగిన అక్రమ లావేదేవీలపై విచారణ జరిపేందుకు ఈడీ రంగంలోకి దిగింది.
ఈ నేపథ్యంలో 1xBet బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను దర్యాప్తు చేస్తోంది. 1xBet వంటి ప్లాట్‌ఫామ్‌లు కోట్లాది రూపాయల విలువైన వ్యక్తులను మోసం చేశాయని, భారీ మొత్తంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది, 18 సంవత్సరాలుగా బెట్టింగ్ పరిశ్రమలో ఉన్న ఈ సంస్థ తన యాప్‌ను ప్రోత్సహించడానికి క్రికెటర్లు సహా అనేక మంది ప్రముఖులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో క్రికెటర్లను విచారిస్తున్న ఈడీ.. భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ చట్టవిరుద్ధమని వారికి తెలుసా అని ప్రశ్నిస్తోంది. ఒప్పందాల కాపీని, 1xBetతో చేసిన అన్ని డాక్యుమెంటేషన్‌ను కూడా సేకరిస్తోంది.
Betting App Case | 8 గంటల పాటు రాబిన్ ఉతప్ప విచారణ
మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనను ఎనిమిది గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గతంలో, రైనా, ధావన్ వంటి వారిని కూడా ఇదే కేసులో ఈడీ గంటల తరబడి ప్రశ్నించింది.