అక్షరటుడే, వెబ్‌డెస్క్: Manipur CM | సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ (Yumnam Khemchand Singh) మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ సీఎంగా ఆయనను పార్టీ ఎంపిక చేసింది.
మణిపూర్‌లో (Manipur) కొన్ని నెలల క్రితం హింస చెలరేగిన విషయం తెలిసిందే. కుకి, నాగా మెయిటీ తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో సీఎం బీరేన్‌సింగ్ తన పదవికి 2025 ఫిబ్రవరి 9న రాజీనామా చేశారు. అక్కడ పరిస్థితులు చక్కబడక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు రాష్ట్రపతి పాలన విధించింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు పడటంతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బీజేపీ న్యూఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్ సీఎంగా మంగళవారం ప్రకటించింది. మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోని ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులందరి ఆమోదం లభిస్తే ఆయన సీఎం కానున్నారు.
Manipur CM | ఖేమ్‌చంద్ సింగ్ నేపథ్యం..
ఖేమ్‌చంద్ సింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2017, 2022లో వరుసగా సింగ్జమే అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. మార్చి 2017లో మణిపూర్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు ఆయన ప్రాముఖ్యతను పొందారు. ఆయన పూర్తి ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీరెన్ సింగ్ మంత్రివర్గంలో చేరారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, మున్సిపల్ పరిపాలన, గృహనిర్మాణ అభివృద్ధి, విద్యతో సహా అనేక శాఖలను నిర్వహించారు. తాజాగా సీఎంగా ప్రమాణం చేయనున్నారు.