YS Sharmila
YS Sharmila | కేసీఆర్​, జగన్​ బంధంపై వైఎస్​ షర్మిల షాకింగ్​ కామెంట్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Sharmila | తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR), ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (YS Jaganmohan Reddy) కలిసే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అప్పటి తెలంగాణ, ఏపీ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ (phone tapping) అని వెల్ల‌డించారు. కేసీఆర్‌ (KCR), జ‌గ‌న్ (Jagan) మ‌ధ్య ఉన్న సంబంధం చూసి ర‌క్త సంబంధం కూడా చిన్న‌బోయింద‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ‌లో (Telangana) న‌న్ను రాజ‌కీయంగా, ఆర్థికంగా అణ‌గదొక్కేందుకు ఆ ఇద్ద‌రు క‌లిసి వేసిన స్కెచ్ అని తెలిపారు. గురువారం ఆమె విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యం (Visakhapatnam airport) వ‌ద్ద విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. త‌మ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయ‌న్న విష‌యం నాకు ముందే తెలుస‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YSRCP MP YV Subbareddy) త‌న ఇంటికి వ‌చ్చి స్వ‌యంగా చెప్పార‌ని, తాను గ‌తంలో మాట్లాడిన కాల్ రికార్డింగ్‌ను వినిపించార‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లోనే త‌మ ఫోన్లు ట్యాప్ అయ్యాయ‌న్నారు. తాను ఎవరెవ‌రితో ఏమేం మాట్లాడానో ఎప్ప‌టిక‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి చేరవేశార‌ని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని, ఇందులో ఎంత పెద్ద వారు ఉన్నా వారికి శిక్ష పడాల‌ని కోరారు.

YS Sharmila | సుబ్బారెడ్డి చెప్పారు..

ఫోన్ ట్యాపింగ్ (phone tapping) జ‌రిగింది ముమ్మాటికి నిజమని, కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి మా ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. త‌న‌తో పాటు త‌న భ‌ర్త‌, ద‌గ్గ‌రి వారి ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌న్నారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నిర్ధారించింది వైవీ సుబ్బారెడ్డియేన‌ని ష‌ర్మిల తెలిపారు. ఆయ‌న స్వ‌యంగా హైద‌రాబాద్‌లోని (Hyderabad) మా ఇంటికి వచ్చి ఈ విష‌యాన్ని చెప్పారన్నారు. మా ఫోన్లు ట్యాప్ చేసి రికార్డింగ్ చేసిన ఆడియో సంభాష‌ణ‌ను సుబ్బారెడ్డి త‌న‌కు వినిపించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఇప్పుడు ఒప్పుకుంటారో లేదో కానీ, ఇది నిజ‌మ‌ని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు తెలిస్తే మీరేం చేశార‌ని అడుగ‌వ‌చ్చ‌ని, కానీ ఆనాడు ఉన్న ప‌రిస్థితులు వేర‌ని ష‌ర్మిల తెలిపారు. అప్పుడు జ‌గ‌న్‌, కేసీఆర్ చేసిన ఆరాచ‌కాల ముందు ఫోన్ ట్యాపింగ్ (phone tapping) చిన్న‌ద‌న్నారు. తాను జ‌గ‌న్‌కు తోడ‌బుట్టిన చెల్లిలిని అయినా ఆ విష‌యం మ‌రిచి నేను ఆర్థికంగా, రాజ‌కీయంగా ఎద‌గ‌కూడ‌ద‌ని వాళ్లు కుట్ర చేశార‌ని విమ‌ర్శించారు. నా భ‌విష్య‌త్తును పాతిపెట్టాల‌ని ఎన్నో చేశార‌ని, త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారిని బెదిరించార‌ని వాపోయారు. తాను తెలంగాణ‌లో (Telangana) పార్టీ పెట్ట‌డంలో జ‌గ‌న్‌కు ఏ సంబంధం లేద‌ని ష‌ర్మిల స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ న‌న్ను తొక్కి పెట్టాల‌ని కుట్ర‌లు చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్ త‌న సొంత మేన‌ల్లుడు, మేన కోడ‌లు ఆస్తులు కాజేసే కుట్ర‌లో భాగంగా ఎలా వ్య‌వ‌హ‌రించారో సాయిరెడ్డి వెల్ల‌డించార‌ని ష‌ర్మిల గుర్తు చేశారు. సాయిరెడ్డి, సుబ్బారెడ్డికి ట్యూషన్లు పెట్టి మీడియాతో ఎలా మాట్లాడించారో ఆయ‌నే చెప్పార‌న్నారు.