అక్షరటుడే, వెబ్డెస్క్ : YouTube Global Outage | ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలు (YouTube Services) అర్ధాంతరంగా స్తంభించడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ను ఓపెన్ చేయడానికి లేదా లాగిన్ కావడానికి ప్రయత్నించినప్పుడు “Something Went Wrong” అనే ఎర్రర్ మెసేజ్ కనిపించినట్లు పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికాలో మాత్రమే 3,50,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం.
సాంకేతిక లోపాలు, సేవల అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్సైట్ DownDetector ప్రకారం అమెరికాలో ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం రాత్రి 7:59 గంటల వరకు YouTubeకు సంబంధించి 2,40,707 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ (International news agency) Reuters కూడా ప్రస్తావించింది. భారత్, యునైటెడ్ కింగ్డమ్ సహా పలు దేశాల్లో యాప్ సరిగా పనిచేయకపోవడం, వీడియోలు ప్లే కాకపోవడం వంటి సమస్యలు విస్తృతంగా నమోదయ్యాయి.
YouTube Global Outage | ఇతర గూగుల్ సేవలపైనా ప్రభావం
ఈ గ్లోబల్ అవుటేజ్ ప్రభావం YouTubeతో మాత్రమే ఆగలేదు. Googleకు చెందిన ఇతర సేవలైన గూగుల్ సెర్చ్, Gmail, Google Meetల్లో కూడా వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. DownDetector డేటా ప్రకారం ఈ సేవలపై కూడా ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. యూజర్లు లాగిన్ కాలేకపోవడం, కంటెంట్ యాక్సెస్ చేయలేకపోవడం, ప్లేలిస్ట్ వీడియోలు పాక్షికంగా పనిచేయడం, ఖాళీ పేజీలు మాత్రమే లోడ్ అవ్వడం, సైడ్బార్ మాత్రమే కనిపించడం వంటి లోపాలు ఎదురయ్యాయి. భారత్లో తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో సమస్యలు ఎక్కువగా నమోదైనట్లు వినియోగదారులు తెలిపారు.
ఈ అంతరాయం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. YouTube మాతృసంస్థ Alphabet ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో యూజర్లు అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. సాంకేతిక నిపుణులు తాత్కాలిక పరిష్కారాలుగా పేజీ రీఫ్రెష్ చేయడం, యాప్ లేదా పరికరాన్ని రీస్టార్ట్ చేయడం, ఇంటర్నెట్ కనెక్షన్ (Internet Connection) తనిఖీ చేయడం, కాష్ మరియు కుకీలను క్లియర్ చేయడం, VPNలను డిసేబుల్ చేయడం, యాప్ను అప్డేట్ చేయడం వంటి చర్యలను సూచిస్తున్నారు. అయితే అసలు సమస్య సర్వర్ స్థాయిలో ఉంటే ఈ పరిష్కారాలు తాత్కాలిక ఉపశమనమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆధారపడే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.