అక్షరటుడే, వెబ్‌డెస్క్: YouTube CEO | ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (Social Media) జీవితంలో అంతర్భాగమైపోయింది. టీనేజ్ యువత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను అతిగా ఆశ్రయిస్తున్నారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఉండేందుకు యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ (YouTube CEO Neal Mohan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పలు వివరాలు పంచుకున్నారు.
YouTube CEO | అతి వినియోగం సరికాదు
సోషల్ మీడియాను అతిగా వినియోగించడం హానికరమని, అందుకే తమ పిల్లలను ఈ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉంచుతున్నామని నీల్ మోహన్ తెలిపారు. వీక్ డేస్‌లో యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ఉపయోగంపై తన పిల్లల విషయంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారాంతాల్లో మాత్రమే కొంత సడలింపు ఇస్తున్నామని, అయినా పరిమితులు ఉంటాయని చెప్పారు. ఈ విషయంలో తాను, తన భార్య ఎంతో జాగ్రత్తగా ఉంటామని వివరించారు.
పిల్లలు సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు.. ఎందుకు ఉపయోగిస్తున్నారనే అంశాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యమని నీల్ మోహన్ అభిప్రాయపడ్డారు. విద్యాబుద్ధులు పెంచడానికి, నైతిక విలువలు నేర్పడానికి ఉపకరించే కంటెంట్ మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. ఈ ఉద్దేశ్యంతోనే 2015లో పిల్లల కోసం ప్రత్యేకంగా ‘యూట్యూబ్ కిడ్స్’ యాప్‌ను అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. కాగా.. నీల్ మోహన్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.