అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Jobs | ఉద్యోగాల కోసం ఎంతో మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఇక్కడ ఉపాధి లేక పొట్ట చేతపట్టుకొని వెళ్తున్న వారిని పలువురు మోసం చేస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగాలు అని నమ్మించి వారి చేత సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ముఖ్యంగా థాయిలాండ్, మయన్మార్ (Thailand and Myanmar) దేశాలకు తరలించి వారిని బందీలుగా మారుస్తున్నారు. అనంతరం సైబర్ నేరాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దేశంలో ఇలా ఎంతో మంది మోసపోతున్నారు. ఈ విషయమై కేంద్ర విదేశాంగ శాఖ సమర్థ చర్యలు చేపట్టింది. అక్కడ చిక్కుకున్న పలువురు యువకులను రక్షించింది.
Fake Jobs | లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ
నకిలీ ఉద్యోగాల పేరిట తెలుగు యువత అక్రమ రవాణా చేస్తున్నారు. థాయిలాండ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లోని టాచిలేక్, ష్వే కొక్కో, మయావాడీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నకిలీ ఉద్యోగ ఆఫర్లతో (fake job offers) మోసం చేసి, సైబర్ నేరాలకు బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ అంశాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రూల్ 377 కింద లోక్ సభలో ప్రస్తావించారు. దీనిపై విదేశాంగ శాఖ సమగ్రంగా స్పందించింది.
మొత్తం 2,545 మంది భారతీయులను అక్రమంగా తరలించినట్లు గుర్తించింది. వారిలో 2,390 మందికి విముక్తి కల్పించింది. భారత రాయబార కార్యాలయాలు (థాయిలాండ్, మయన్మార్) చేపట్టిన చర్యల ఫలితంగా అక్కడ చిక్కుకున్న వారిని రక్షించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు 316 మంది ఉండగా.. అందులో 297 మందిని ఇప్పటికే రక్షించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.