అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు.
ఎడపల్లి పోలీస్స్టేషన్ (Edapalli Police Station) పరిధిలో జిల్లా పోలీస్ శిక్షణ మైదానంలో 26 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ టోర్నీని బోధన్ పోలీసుల (Bodhan Police) ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం టోర్నీ ముగింపు కార్యక్రమం నిర్వహించగా.. సీపీ సాయిచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఈ టోర్నీ నిర్వహించినట్లు తెలిపారు. యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) కార్యక్రమాన్ని బోధన్ పోలీస్ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి నిర్వహించడం అభినందనీయమన్నారు.
యువత ఉత్సాహంగా టోర్నీలో పాల్గొన్నారని సీపీ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని.. మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలన్నారు. ఈ రోజుల్లో యువత మత్తుపదార్థాల వైపు ఆకర్షితులవున్నారన్నారు.
ఒక్కసారి ఈ వ్యసనాల్లోకి అడుగుపెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువత దేశ భవిష్యత్తు అని.. తాము ఆరోగ్యంగా ఉంటూ.. మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు సానుకూలమైన దారిలో నడిచేలా చేస్తాయన్నారు.
అనంతరం.. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, బోధన్ ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎడపల్లి ఎస్సై రమ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందేర్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, కోటగిరి ఎస్సై సునీల్ 26 జట్ల క్రీడాకారులు యువత పాల్గొన్నారు.
