అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Nizamabad | యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) పిలుపునిచ్చారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్ (Mopal Police Station) పరిధిలో ప్రెసిడెన్సీ స్కూల్ మైదానంలో మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు.
కమ్యూనిటీ కాంటాక్ట్ (Community Contact) కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచే ఉద్దేశంతో పోటీలు ఏర్పాటు చేశారు. ఈ టోర్నీలో 13 గ్రామాల నుండి 13 టీంలు పాల్గొన్నాయి. నాలుగు రోజుల నుండి నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు.
CP Nizamabad | టోర్నీ ఆలోచన భేష్..
ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. యువకులందరినీ ఒక్కచోట చేర్చి టోర్నీ నిర్వహించాలనే ఆలోచన చేయడంపై మోపాల్ పోలీసులను అభినందించారు. యువకులంతా ఉత్సాహంగా టోర్నీలో పాల్గొని, స్ఫూర్తిదాయక ప్రదర్శన చూపినందుకు అభినందించారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని.. యువతను నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలని స్పష్టం చేశారు.
CP Nizamabad | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మన సమాజంలో యువత పెద్దఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని.. ఇది ప్రమాదకరమని సీపీ స్పష్టం చేశారు. ఆ వ్యసనాలకు అలవాటుపడితే జీవితాన్ని పూర్తిగా నాశనం అవుతుందన్నారు. యువత ఆరోగ్యంగా ఉంటూ.. మంచి ఆలోచనలతో దేశభవిష్యత్తుకు బాటలు చేయాలని సూచించారు. క్రీడలు వ్యసనాల నుంచి మంచిదారివైపు మళ్లిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం క్రీడాకారులకు సీపీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.సురేష్ కుమార్, మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్సై సుస్మిత, యువకులు తదితరులు పాల్గొన్నారు.