అక్షరటుడే, వెబ్డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని హెచ్‌ఐసీసీ వేదికగా శనివారం నిర్వహించిన తెలంగాణ క్రీడా సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన యువత ప్రస్తుతం దశ, దిశ లేకుండా వ్యసనాలకు బానిస అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల నుంచి యువతకు కాపాడుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ పాలసీతోనే ఇది సాధ్యమన్నారు.
Sports Policy | ఆట స్థలాలు అవసరం
యువతకు ఆట స్థలాలు అవసరం, మాదకద్రవ్యాలు కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడా విధానాన్ని (Sports Policy) ఆయన ఆవిష్కరించారు. క్రీడా సంస్కృతి లేకపోవడంతోనే యువత వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగంలోనే కాకుండా మైదానంలో కూడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించకపోవడం దేశానికి, రాష్ట్రానికి చాలా ప్రమాదమని సీఎం పేర్కొన్నారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Sports Policy | ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధం
క్రీడలకు తెలంగాణను వేదిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ 2047లో స్పోర్ట్స్ పాలసీకి ఒక ఛాప్టర్ కేటాయించామన్నారు. నేషనల్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ మిలటరీ గేమ్స్ నిర్వహించిన చరిత్ర హైదరాబాద్కు ఉందన్నారు. 2026లో ఖేల్ ఇండియా (Khel India) పోటీల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఒలింపిక్స్ (Olympics) లో సైతం రెండు విభాగాల నిర్వహణకు సిద్ధమని చెప్పామన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో భారత్ ఒక్క బంగారు పథకం సాధించకపోవడం దేశానికి అవమానమన్నారు. క్రీడాకారుల కోసం రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.