అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPO Listings | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market)లో బుధవారం మూడు మెయిన్ బోర్డ్ కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో మీషో లిస్టింగ్‌లో అదరగొట్టింది. మిగతా రెండూ పరవాలేదనిపించాయి.
స్టాక్ మార్కెట్ (Stock Market)లో సందడి చేస్తున్న ఐపీవోలు.. ఇన్వెస్టర్లకు లాభాలనూ ఆర్జించి పెడుతున్నాయి. బుధవారం వచ్చిన మూడు మెయిన్ బోర్డ్ కంపెనీలూ ప్రీమియంతోనే లిస్టవడం గమనార్హం. ఇందులో మీషో భారీ లాభాలను అందించగా.. ఏక్వస్్ 12 శాతం లిస్టింగ్ గెయిన్స్ అందించింది. విద్యా వైర్స్ ఫ్లాట్‌గా ప్రారంభమైనా ఆ తర్వాత పెరిగింది.
IPO Listings | 46 శాతం ప్రీమియంతో మీషో ఆరంగేట్రం
అంచనాలకు అనుగుణంగానే మీషో(Meesho) రాణించింది. ప్రారంభ సమయంలోనే 46 శాతానికిపైగా లాభాలను అందించింది. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 5,421 కోట్లు సమీకరించింది. ఇందులో ఫ్రెష్ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 111గా నిర్ణయించింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్ స్వీకరించారు. ఇన్వెస్టర్లనుంచి భారీగా ఆదరణ లభించింది. మొత్తం 81.76 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా.. రిటైల్ పోర్షన్ 19.89 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో రూ. 51.50 ప్రీమియంతో రూ. 162.50 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో (IPO) అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 46.4 శాతం లాభాలు వచ్చాయన్న మాట. లిస్టింగ్ తర్వాతా షేర్లు పెరిగాయి. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో 56 శాతం ప్రీమియంతో రూ. 173.43 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఏక్వస్..
విమానాలు, కార్లు, ఇతర వాహనాలకు విడిభాగాలు తయారు చేసే ఏక్వస్ కంపెనీ షేర్లు 12.9 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 922 కోట్లు సేకరించింది. మొత్తం 104.3 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో రిటైల్ పోర్షన్ 81.03 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. బుధవారం కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 124 కాగా.. రూ. 16 ప్రీమియంతో రూ. 140 వద్ద ప్రారంభమైంది. లిస్టింగ్ సమయంలో ఐపీవో ఇన్వెస్టర్లకు 12.9 శాతం లాభాలను అందించింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో 19 శాతం ప్రీమియంతో రూ. 147.89 వద్ద ట్రేడ్ అవుతోంది.
విద్య వైర్స్..
వైర్లు, కేబుల్స్ తయారు చేసే విద్య వైర్స్(Vidya Wires) కంపెనీ ఫ్లాట్‌గా లిస్టయ్యింది. అయితే తర్వాత పుంజుకుని లాభాలబాట పట్టింది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్‌నుంచి రూ. 300 కోట్లు సమీకరించింది. చిన్న ఇష్యూ కావడంతో రిటైల్ ఇన్వెస్టర్ల(Retail investors)నుంచి భారీ డిమాండ్ కనిపించింది. మొత్తం 28.53 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఐపీవో.. రిటైల్ పోర్షన్ మాత్రం 29.98 రెట్టు సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. ఒక్కో ఈక్విటీ షేరు ధర గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 52 కాగా.. అదే ధర వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత క్రమంగా ధర పెరిగింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో 11 శాతం ప్రీమియంతో రూ. 57.72 వద్ద ఉంది.