అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi | ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన మాజీ ప్రియుడితో కలిసి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసింది. అంతేగాకుండా అగ్ని ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే యత్నం చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతోన్న రామ్కేశ్ మీనా(32) అనే యువకుడు ఢిల్లీలోని గాంధీ విహార్ (Gandhi Vihar) ప్రాంతంలో ఈ నెల 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రామ్కేశ్ మీనాతో అదే రూమ్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్న అమ్రిత చౌహాన్(21) తన మాజీ ప్రియుడితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు.
Delhi | వీడియోలు డిలీట్ చేయకపోవడంతో..
రామ్కేశ్ మీనా, అమ్రిత చౌహాన్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే తన వ్యక్తిగత వీడియోలను డిలీట్ చేయడానికి మీనా నిరాకరించాడు. దీంతో అమ్రిత అతడిని చంపాలని ప్లాన్ చేసింది. మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్(27), అతని స్నేహితుడు సందీప్ కుమార్(29) సాయంతో హత్య చేసింది. ముగ్గురు కలిసి అతడి గొంతు నులిమి చంపేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు.
Delhi | నెయ్యి, వైన్ పోసి..
ఫోరెన్సిక్ విద్యార్థి అయిన అమ్రిత తన సహజీవన భాగస్వామిని చంపిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా స్కెచ్ వేసింది. మృతదేహంపై నెయ్యి (Ghee), వైన్ (Wine) పోసింది. అనంతరం గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి నిప్పు అంటించింది. అనంతరం అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. అగ్ని ప్రమాదంలో తన లవర్ చనిపోయాడని నమ్మించేలా ప్లాన్ చేసింది. అయితే మంటలు అంటుకోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి రామ్కేశ్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
Delhi | పట్టించిన సీసీ కెమెరాలు
పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. అగ్ని ప్రమాదం జరగడానికి ముందు మాస్క్‌లు ధరించిన ఇద్దరు అక్కడకు రాగా.. కొద్దిసేపటికే ఒకరు బయటకు వెళ్లినట్లు రికార్డయ్యింది. ఆ తర్వాత యువకుడు, యువతి వెళ్లిపోయారు. ఆమెను రామ్ కేశ్ సహజీవన భాగస్వామి అమ్రితగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె కోసం గాలించారు. ఈ నెల 18న నిందిరాలిని అదుపులోకి తీసుకున్నారు. తన ఫోటోలు, వీడియోలు హార్డ్‌డిస్క్‌లో దాచిపెట్టాడన్న నెపంతో తానే హత్య చేసినట్టు ఆమె అంగీకరించింది. మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్, సందీప్ కుమార్‌లతో కలిసి హత్యచేసినట్టు చెప్పింది. దీంతో సుమిత్‌ను 21న, సందీప్‌ను 23న అరెస్ట్ చేశారు.

